ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన 36 గంటల ధర్నా రెండో రోజైన మంగళవారం ఉధృతంగా జరిగింది. అంగన్‌వాడీలు రెట్టించిన ఉత్సాహంతో ధర్నాలో పాల్గొన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి తదితరులు ప్రసంగించి, ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రమాసుష్మ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తానని జగన్ పాదయాత్రలో హామీనిచ్చినా నాలుగేళ్ల పాలనలో అమలు చేయలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. పోరాట ఫలితంగా కర్నాటక ప్రభుత్వం గ్రాట్యుటీ అమలుకు సిద్ధమైందని గుర్తు చేశారు. కనీస పెన్షన్ రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీల పోరాటానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ అండగా ఉంటామని ప్రకటించారు. సుబ్బరావమ్మ మాట్లాడుతూ బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో అంగన్‌వాడీల సమస్యలపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిరవధిక ఆందోళనకూ దిగుతామన్నారు. ప్రభుత్వ నిర్భంధం, అధికారుల బెదిరింపులను దాటుకొని వేలాదిగా పాల్గొన్న అంగన్‌వాడీలకు అభినందనలు తెలిపారు. నోటీసులకు, బెదిరింపులకు భయపడే ఉద్యమ చరిత్ర అంగన్‌వాడీలకు లేదని, ప్రభుత్వ పీఠాలు కదిలించిన చరిత్ర ఉందని గుర్తుచేసుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఐసిడిఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం తెచ్చిన ఎన్‌ఇపిలోని ప్రీ స్కూల్ విధానాన్ని ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా జగన్ ప్రభుత్వం మాత్రం సిద్ధమై, 172 సర్క్యులర్ తెచ్చిందన్నారు. పోరాట ఫలితంగా అంగన్‌వాడీ కేంద్రాల విలీనం నిలిచినా ప్రమాదం పొంచి ఉందని, సర్య్కులర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలంటే ఉద్యోగులు కాదంటున్న ప్రభుత్వం, సంక్షేమ పథకాలు అమలుకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులని తిరస్కరిస్తోందని మండిపడ్డారు. అంగన్‌వాడీల్లో వితంతువులు, వికలాంగులు ఉన్న కుటుంబాల్లో కూడా పెన్షన్లు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలు చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వని మానవత్వం లేని ప్రభుత్వం అని మండిపడ్డారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ లేని విధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ద్దేశపూర్వకంగా తనిఖీలు చేపడుతూ భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సకాలంలో సరఫరా చేయాలని, నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని, నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్న బిల్లులు సక్రమంగా చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆహార కమిషన్ చైర్మన్ విజయప్రతారెడ్డికి హితవులు పలికారు. వై.నేతాజి మాట్లాడుతూ పిల్లల్ని ఆడించటం, పాడించాల్సిన అంగన్‌వాడీలకు రకరకాల యాప్‌లు ప్రవేశపెట్టి, వాటిల్లో సమాచారం, ఫొటోలు అప్‌లోడ్ చేయాలని తీవ్రమైన పనిఒత్తిడి పెంచుతున్నారన్నారు. నాలుగేళ్ల క్రితం రూ.వెయ్యి పెంచి గొప్పగా చేశామని చెప్పుకుటున్న ప్రభుత్వానికి వంటగ్యాస్, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశానికి అంటాయని కనిపించిట్లేదా అని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. జిల్లాలో సిడిపిఒల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల నుండి ఎదురు చూసి అంగన్‌వాడీలు సహనం కోల్పోయారని, ప్రభుత్వం స్పందిం చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ధర్నాలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు భాగ్యరాజు, లక్ష్మణరావు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడి..
ధర్నా అనంతరం ధర్నా చౌక్ నుండి ర్యాలీగా వెళ్లి వందలాది మంది అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు గేటుకు ఎదురుగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీలు వాటిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, అంగన్‌వాడీలు, సిఐటియు నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవటంతో గేటు ఎదుటే భైటాయించి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. ఆందోళన వద్దకు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై డిఆర్‌ఒ హామీ ఇవ్వటంతో ముట్టడిని విరమించుకున్నారు.
వెల్లువెత్తిన సంఘీభావం
అంగన్‌వాడీల ధర్నాకు వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఎల్‌ఐసి ఉద్యోగులు ధర్నాకు మద్దతు ఇచ్చి రూ.5 వేలు విరాళం ప్రకటించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముత్యాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి యం.కిరణ్, ఎల్‌ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి గాంధీ రామ్మోహనరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి, అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, ఆర్టీసి ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టివిజి రవిశంకర్, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు వి.వి.కె.సురేష్, మహిళా కన్వీనర్ ఎం.సుధారాణి, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.సాంబశివరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజరుకుమార్, వాచ్‌మెన్ల సంఘం నాయకులు నికల్సన్, బిల్డింగ్ వర్కర్ల సంఘం నాయకులు ఖాసింవలి తదితరులు ధర్నాలో పాల్గొని మద్దతు పలికారు.
యాప్‌లు సరిగా పనిచేయవు
ధనలక్ష్మి, ఫిరంగిపురం.
ప్రభుత్వం రెండు రకాల యాప్‌లు ప్రవేశపెట్టింది. ఇవి సరిగా పనిచేయవు. అధికారులు అర్ధరాత్రి కూడా మెస్సేజ్‌లు పెట్టి ఐదు నిమిషాల్లో సమాచారం అప్‌లోడ్ చేయాలని ఒత్తిడి చేస్తారు. అటు యాప్‌లు పనిచేయక, అధికారుల ఒత్తిడితో బిపిలు, షుగర్‌లు తెచ్చుకొని తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నాం. రోజుకో రకంగా యాప్‌ల వర్షన్ మార్చేస్తున్నారు. అవీ సక్రమంగా పనిచేయవు.
ఆశతో ఎదురు చూస్తున్నాం
ఎం.శ్యామల, గుంటూరు.
తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాలుగేళ్లుగా వేతనాలు పెంచుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం వచ్చిన కొత్తలో రూ.వెయ్యి పెంచి చేతులు దులిపేసుకుంది. హామీని అమలు చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. రాజకీయ వేధింపులు అరికట్టాలి.
ప్రమోషన్లలో రాజకీయ జోక్యం వద్దు
ఎం.బేబీ మధులత, తాడేపల్లి.
హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలి. రాజకీయ నాయకులు వారి అనుయాయుల్ని నియమించుకోవటానికి ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రమోషన్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న హెల్పర్లకు వేధింపులు సరికాదు. అర్హులకు పారదర్శకంగా ప్రమోషన్లు కల్పించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఇచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.










