- మావోయిస్టు క్యాంపుపై పోలీసుల దాడి
- ఇరు వర్గాల మధ్య కాల్పులు
ప్రజాశక్తి-చింతూరు
బీజాపూర్ జిల్లాలోని ఇసుల్నార్ అటవీ ప్రాంతం బుధవారం కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టు క్యాంపుపై పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... ఇసుల్నార్ అటవీ ప్రాంతంలో రెండో కంపెనీకి చెందిన మావోయిస్టు కమాండర్ వేల్లా మోడియం, డివిజన్ మిలటరీ ఇన్‌ఛార్జ్ రాహుల్ తేలమ్, గంగలూరు అసిస్టెంట్ కమాండర్ దినేష్ మోడియం, డీసీఎం భాస్కర్, ఏసీఎం వర్గీష్‌తోపాటు 40 నుంచి 50 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలతోపాటు 210 కంపెనీ కోబ్రా బలగాలు మావోయిస్టులు సమావేశమైన ప్రదేశానికి చేరుకున్నాయి. పోలీసులను గమనించగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు గంటకు పైగా కొనసాగాయి. ఆ తరువాత మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవి లోపలికి వెళ్లిపోయారు. సంఘటనా స్థలం నుంచి పోలీసు బలగాలు ఓ టిఫిన్ బాక్స్, బాంబు, విద్యుత్ వైరు బండిల్, ఫ్యూజ్ వైర్, డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో కనీసం ముగ్గురు మావోయిస్టులు చనిపోయి లేదా గాయపడి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసుల వైపు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నాయి.










