Nov 20,2023 21:37

విద్యుత్‌ అధికారితో వాగ్వివాదం చేస్తున్న బాధిత రైతు సురేష్‌



డబ్బులు చెల్లించినా ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వరా..
ప్రజాశక్తి-గుంతకల్లు   
'లక్షలు సాగు చేసి మిరప పంటను సాగు చేశా.. నీరు సరఫరా కాకపోవడంతో ఎండు దశకు చేరుకుంది.. ఈ సమయంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని డీడీ చెల్లించా.. అయినా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎందుకు ఇవ్వరు..' అంతూ విద్యుత్‌ శాఖ అధికారులపై ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంతకల్లు మండలం పాతకొత్త చెరువు గ్రామానికి చెందిన రైతు వడ్ల రవిచంద్రాచారి కుమారుడు సురేష్‌ తమ పొలంలో విద్యుత్‌ సరఫరా కోసం డిపి (ట్రాన్స్‌ ఫార్మర్‌)ఏర్పాటుకు సెప్టెంబర్‌ 26న సదరన్‌ పవర్‌ డిస్ట్రబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరున రూ.23,300 డీడీ తీసి రూరల్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఇచ్చాడు. దీంతోపాటు విద్యుత్‌ శాఖ అధికారులకు అదనంగా మారో రూ.15 వేలు ముడుపులు చెల్లించానన్నారు. అయినా రెండు నెలలు గడిచినా ట్రాన్స్‌ఫార్మర్‌ ఇవ్వకపోగా ఒకరిపై మరొకరు చెబుతూ వస్తున్నారని వాపోయాడు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఎండుదశకు చేరుకుంటోందన్నారు. అయినా అధికారులకు కనికరం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చేసేది లేక బాధిత రైతు సోమవారం విద్యుత్‌ కార్యాలయానికి చేరుకుని అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీపీ ఏర్పాటుకు సీనియారిటీ సాకు చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారని రైతు అసహనం వ్యక్తం చేశాడు. దీంతో విద్యుత్‌ సిబ్బంది కార్యాలయానికి తాళం వేసుకుని బయటికి వెళ్లిపోయాడు. తనకు రావాల్సిన డీపీ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించాడు.