Jul 11,2023 23:09

వాలంటీర్లపై కోపం లేదు
సిఎం జగన్‌ విధానాలు దారుణం
ఆడపిల్లల అదృశ్యంపై నోరుమెదపని వైసిపి
ప్రజాధనం దుర్వినియోగం చేస్తే నిలదీస్తాం
సమస్యను పక్కదోవ పట్టించడానికి వైసిపి ప్రయత్నం
దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గ సమీక్షలో పవన్‌కల్యాణ్‌
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

'నన్ను డబ్బుతో, పదవులతో కొనలేరు, రూల్‌ ఆఫ్‌ లాను నమ్ముతాను. దేశం, సమాజం తప్ప తనకు ఏమీ తెలీయవు..' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వారాహి రెండోవిడత యాత్రలో భాగంగా మూడోరోజు ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో దెందులూరు, ఉంగుటూరు నియోజవర్గాల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధానాలపై మాట్లాడితే 'వదలమంటే పాముకి కోపం, వద్దంటే కప్పకి కోపం' అన్నట్లు పరిస్థితి తయారైందన్నారు. కొల్లేరు పర్యావరణ కాలుష్యంపై మాట్లాడితే ఆక్వారైతులు ఇబ్బందిపడే పరిస్థితి ఉందన్నారు. అంబేద్కర్‌ చెప్పినట్లు రూల్‌ ఆఫ్‌లాను తాను నమ్ముతానన్నారు. సమస్యలపై అవసరమైతే చొక్కాపట్టుకుని నిలదీయాలని, న్యాయం పోరాటం చేయాలన్నారు. దళితులు జగన్‌ను తమవాడంటూ ఎత్తేశారని, అధికారంలోకి రావడంతోనే విదేశీ విద్యను తీసేశారన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వాలంటీర్లపై తనకు కోపంలేదని, వారి పొట్టకొట్టాలన్న ఉద్ధేశమే లేదన్నారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవ్యవస్థ, బ్యూరోక్రసీ వంటి వ్యవస్థలుండగా సమాంతరంగా మరో వ్యవస్థ ఎందుకన్నారు. వాలంటీర్లను నిలదీసే పరిస్థితి లేదన్నారు. ఉపాధి కూలీలకు ఇచ్చే వేతనం కూడా వాలంటీర్లకు ఇవ్వడం లేదన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ, రేషన్‌ వ్యాన్లు లేకపోతే ఇంతకుముందు దేశం ఆగిపోయిందా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని విశ్వసిస్తే ఇలాంటి ఆలోచనలు రావన్నారు. 2019 నుంచి 2021 మధ్యలో 29,279 మంది ఆడపిల్లలు అదృశ్యమైనట్లు పార్లమెంట్‌లోనే లెక్కలు చెప్పారన్నారు. పెగాసిస్‌ సాఫ్ట్‌వేర్‌పై బిజెపిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వాలంటీర్లతో వ్యక్తిగత సమాచారం సేకరించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగన్‌ ఇంట్లో ఏం చేసినా మనకెందుకని, అలాగే ఎవరి వ్యక్తిగత స్వేఛ్ఛను హరించకూడదన్నారు. జగన్‌ పబ్జి, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడుతున్నప్పటికీ ఇబ్బందిలేదని, ప్రజల డబ్బుతో ఆడితే నిలదీస్తామన్నారు. తన వ్యక్తిగత విషయాలపై చర్చాగోష్టులు పెట్టే మీడియా వేలాది మంది ఆడపిల్లల అదృశ్యంపై చర్చలు ఎందుకు పెట్టడం లేదన్నారు. ప్రొద్దుటూరులో దళిత బాలికపై అత్యాచారం జరిగితే ఎప్పటికో స్పందించారని, నిందితులను వదిలేశారో ఉంచారో కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. తమ ఇంట్లో ఆడపిల్ల అదృశ్యమైతే ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తాను సరైన పాయింట్‌ ఎత్తానని వీరి ప్రవర్తను బట్టి అర్థమవుతుందన్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న జగన్‌ అనే జలగను వదిలించుకోవాలన్నారు. కిరాయి మూకలను దింపుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఫ్యాక్షనిస్టులతో జగన్‌ పెట్టుకున్నాడే తప్ప విప్లవకారులతో పెట్టుకోలేదన్నారు. మద్యం నుంచి దోచిన రూ.30 వేల కోట్లు వాలంటీర్లకు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని కోరారు. సంస్కార హీనుడు సిఎం అయితే ఎలా ఉంటాడో ఈతరం జగన్‌ను చూసి తెలుసుకోవాలన్నారు. అమ్మఒడి సభలో పిల్లల ముందు ఆయన మాట్లాడిన మాటలే అందుకు నిదర్శమన్నారు. 'నేను పెద్దహీరోనే.. ఏడాదికి రూ.400 కోట్లు సంపాదించగలను.. జగన్‌లా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడుకోవచ్చు.. కానీ అలాంటి మనస్తతత్వం నాకు లేదు.. 18 ఏళ్ల వయస్సులోనే దేశం, సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను..' అని స్పష్టం చేశారు. జగన్‌ తన వ్యవహరశైలితో రేపిస్టులను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నియోజకర్గ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.
వాలంటీర్‌ వ్యవస్థపై కోర్టులో ఛాలెంజ్‌ చేస్తాం..!
వ్యక్తిగత డేటాను సేకరించడం చట్టవిర్ధుద్దమని, జగన్‌ వాలంటీర్ల చేత వ్యక్తిగత డేటాను సేకరించడం, ఆ వ్యవస్థపై కోర్టులో ఛాలెంజ్‌ చేస్తామంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో ఉంగుటూరు నియోజవర్గనేతలతో, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. డబ్బు సంపాదించాలని పోటీపడితే ఏడాదికి రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్లు సంపాదిస్తానన్నారు. 18 ఏళ్ల వయస్సులోనే సమాజం వైపు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విద్య, చదువు ప్రజలకు ప్రాథమిక హక్కులన్నారు. వివాహమైన మహిళ గురించి ప్రస్తావించాలంటే భార్య, సతీమణి అని అంటామని, జ్ఞానంలేని జగన్‌ మాత్రం పెళ్లాం అంటూ సంబోదిస్తారన్నారు. సంస్కారంలేని, క్యారెక్టర్‌ లేని వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. వాలంటీర్‌ వ్యవస్థ సంఘ విద్రోహ శక్తులకు ఉపయోగపడు తుందన్నారు. 50 కుటుంబాలకు ఒక జగన్‌ తయా రయ్యాడన్నారు. వ్యక్తిగత సమాచారం వాలంటీర్లకు ఇవ్వొద్దన్నారు. జనాలకు జనసేన కాపాలా కాయాల న్నారు. జగన్‌ అనే వ్యక్తి ఉంటే పవన్‌కల్యాణ్‌ ఉంటా డన్నారు. ఒక కొడుకుని దేశానికి ఇచ్చేశానని అనుకో మని అమ్మకు చెప్పానన్నారు. వైసిపిని ప్రశ్నించి, ఎదుర్కోవాలంటే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఉంగుటూరు : ఏలూరు నుంచి మంగళవారం సాయంత్రం బయలుదేరిన జనసేన అధినేత పవన్‌ వారాహి వాహనానికి ఉంగుటూరులో ఘనస్వాగతం లభించింది. అభిమానులు, జనసేన కార్యకర్తలు, ప్రజానీకం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండలంలో కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు, బాదంపూడి మీదుగా యాత్ర సాగింది. అన్ని చోట్లా ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి రాత్రికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి పవన్‌ చేరుకున్నారు.