
ప్రజాశక్తి - నిజాంపట్నం
మండల కేంద్రంకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ దబ్బకూటి శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రతిభా పురస్కారం లభించింది. వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్‌లో భాగంగా స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవనంలో పురస్కారాన్ని శ్రీనివాసరావు బుధవారం అందుకున్నారు. గతంలో భీమడోలు ప్రాంతంలో జరిగిన జాతీయస్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాపులో శ్రీనివాసరావు ప్రథమ బహుమతి, పాట్వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఈ అవార్డు దక్కటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అవార్డును అడిషనల్ సిసిఎల్‌సి కమ్ సెక్రటరీ, సీఈఓ ఆఫ్ సెర్ఫ్ ఎండి ఇంతియాజ్ చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు రావడంపై రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రామణరావు, నిజాంపట్నం మండల అధ్యక్షులు మోపిదేవి విజయనిర్మల వెంకట హరినాథ్ బాబు, జడ్పిటిసి నర్రా సుబ్బయ్య, సొసైటీ ప్రెసిడెంట్ మరక శ్రీనివాసరావు, మాజీ జడ్పిటిసి పి వాసుదేవరావు, జీడీసీసీ ఛైర్మన్ మదన్ మోహన్ భాగ్యలక్ష్మి అభినందనలు తెలిపారు.