Mar 26,2023 00:32

మాట్లాడుతున్న హెచ్‌ఎం జయలక్ష్మి

ప్రజాశక్తి -రావికమతం:డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మేడివాడ జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు ఎం.జయలక్ష్మి సూచించారు. పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ, డౌన్‌ సిండ్రోమ్‌ పూర్తిగా జన్యు సంబంధమైన వ్యాధి అన్నారు. ఈ వ్యాధి క్రోమోజోముల అపసవ్యతతో వస్తుందని తెలిపారు. డౌన్‌ సిండ్రోమ్‌ ఉన్న గర్భస్థ శిశువుల్లో క్రోమోజోముల్లోని 21వ జతలో ఒక క్రోమోజోమ్‌ అదనంగా ఉంటుందన్నారు. దీంతో బిడ్డల అసాధారణ ఎదుగుదలకు కారణం అవుతుందని ఆమె తెలిపారు. దీని ఫలితంగా శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉండదన్నారు. మేనరిక వివాహాల వలన, తల్లి వయసు 35 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంటే వారికి పుట్టే పిల్లలు ఇలా డౌన్‌ సిండ్రోమ్‌తో పుట్టే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎర్రయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు గోవిందరావు, విద్యార్థులు పాల్గొన్నారు.