Jul 09,2023 20:37

స్నేహితురాలి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిస్తున్న మిత్రులు

ప్రజాశక్తి - చిప్పగిరి
అనారోగ్యంతో తోటి స్నేహితురాలి భర్త చనిపోవడంతో ఆమె ఇబ్బందులు చూసి స్నేహితుల బృందమంతా ఆర్థిక సహాయం అందించింది. మండలంలోని నేమకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1994 బ్యాచికి సంబంధించిన తిమ్మాపురం గ్రామానికి చెందిన లక్ష్మికి, ఏరూరు గ్రామానికి చెందిన బారికి వీరేష్‌తో వివాహం జరిగింది. ఆమె భర్త బారికి వీరేష్‌ (47) నెల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం వైసిపి కన్వీనర్‌ ఏరూరు రంగస్వామి ఆధ్వర్యంలో మిత్రులంతా స్నేహితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. తాము అండగా ఉంటామని, కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. స్నేహితురాలి కుటుంబ సభ్యులందరూ మిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.