ప్రజాశక్తిలి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లా మహిళాభివద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మచిలీపట్నంలో స్థానిక పోర్ట్ రోడ్లో నిర్మించిన 'బాలసదన్' నూతన భవనాన్ని మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ , మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మలతో కలిసి ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాతల వివరాలతో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. నూతన భవనంలో డార్మెటరీ రూములు, డైనింగ్ రూమ్, ఆఫీస్ రూమ్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా వారు అనాధ బాలికలకు దాతల సహకా రంతో నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ చేశారు. అనాధ పిల్లలను అక్కున చేర్చుకుని వారిని సంరక్షిం చేందుకు బాలసదనం ఏర్పాటు చేసినట్లు, అనాధలను ఈ విధంగా ఆదుకోవడంలో దాతల సహకారం మరువ లేనిదని కలెక్టర్, ఎమ్మెల్యే తెలిపారు. బాలసదనంలో బాలికలకు అవసరమైన మౌలిక వసతులు డార్మిటరీలు, డైనింగ్ రూమ్, టాయిలెట్స్ సౌకర్యం కల్పించినట్లు, డార్మెటరీ రూములలో బాలికలకు దాతల సహకారంతో మంచాలు, బెడ్స్, దుప్పట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతలను ఎమ్మెల్యే కలెక్టర్ అభినందించి వారి దాతత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా దాతలను కలెక్టర్ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, స్థానిక కార్పొరేటర్ చిత్తజల్లు ప్రసన్న, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, సివిల్ సప్లై కార్పొరేషన్ డిఎం శ్రీధర్, నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా తదితరులు పాల్గొన్నారు.










