Mar 24,2023 22:32

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: దాస్‌ కా ధమ్కీ చిత్రం మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని, అంతకంటే ముఖ్యంగా మంచి సినిమాను ప్రేక్షకులకు అందించానని సంతృప్తిగా ఉందని సినీనటుడు విశ్వక్‌ సేన్‌ అన్నారు. దాస్‌ కా ధమ్కీ చిత్రం విజయయాత్రలో భాగంగా నగరంలోని జయరాం ధియేటర్‌లో శుక్రవారం కొద్దిసేపు ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయన్నారు. సినిమాను ఎంతో నమ్మకంతో చేశామని, విడుదలైన తరువాత మంచి ఆదరణ రావడంతో అంతకంటే మంచి ఫలితం వచ్చిందని ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దాస్‌ కా ధమ్కీ 2 , ఫలక్‌నుమా దాస్‌ 2 స్వీక్వెల్‌ తీయాలని దానికి సంబంధించిన స్క్రిప్టు త్వరలో చేయనున్నట్లు తెలిపారు. జయరాం థియేటర్‌ మేనేజర్‌ కె.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ మొదటి రోజు నుండి మంచి ఓపెనింగ్స్‌ ఉన్నాయని, పరీక్షలు అయిపోగానే మంచి కలెక్షన్స్‌ రాబడుతుందన్నారు. ఈ సమావేశంలో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్‌ పి.వసంత్‌కుమార్‌, పి.వపన్‌కుమార్‌, జయరామ్‌ థియేటర్‌ బాధ్యులు వి.రమేష్‌ పలువురు పాల్గొన్నారు.