ప్రజాశక్తి - కోసిగి రూరల్
ప్రజలను మతమౌఢ్యంలోకి నెడుతున్న ప్రస్తుత తరుణంలో చార్లెస్ డార్విన్ 150 ఏళ్ల ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శంకరయ్య తెలిపారు. బుధవారం మండలంలోని దుద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చార్లెస్ డార్విన్ వర్థంతి నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటలక్ష్మి చార్లెస్ డార్విన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నేటి పరిస్థితుల్లో చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంత ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. విద్యార్థులకు చిన్నప్పుడే ఈ సిద్ధాంతాన్ని, విశేషాలను తెలియజేయాలని కోరారు. అనంతరం శంకరయ్య మాట్లాడారు. జీవుల ఆవిర్భావానికి ఏ అతీత శక్తి తోడ్పడలేదని, జీవులు పరిసరాల్లోని మార్పులు, సంఘర్షణ వల్ల తరతరాల్లో వచ్చిన మార్పులు, కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో జరగడం వల్ల చివరిగా నేటి ఆధునిక మానవుడు ఆవిర్భవించాడని తెలిపారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక విస్ఫోటన యుగంలో నివసిస్తున్న సామాన్య ప్రజలు పరిణామ వాదాన్ని విశ్వసించడం లేదని చెప్పారు. సైన్స్ ప్రేమికులు చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా మూఢనమ్మకాల నిర్మూలన, విభిన్న మతాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నించాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, నవీన్ కుమార్ రెడ్డి, నాగలింగమయ్య, కళావతి, జగదీప్, సౌజన్య, కౌసర్, మైథిలి, విద్యార్థులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జెవివి జిల్లా అధ్యక్షులు శంకరయ్య










