Mar 17,2023 21:08

తరగతి గదిలో ఫ్యాన్లు ధ్వంసం చేశారని విద్యార్థులపై ఉపాధ్యాయుల దాష్టీకం
అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో అప్పగింత
తల్లిదండ్రుల ఆందోళన
విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

పాఠశాలలో ఫ్యాన్లు ధ్వంసం చేశారనే కారణంతో తొమ్మిదో తరగతి విద్యార్థులు ముగ్గురిని ఆ పాఠశాల ఉపాధ్యాయులు మందలించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి దండించిన ఘటనపై ఆ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శుక్రవారం స్థానిక జెడ్‌పిహెచ్‌ బాలుర హై స్కూల్‌ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జెడ్‌పిహెచ్‌ బాలుర హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులు రోజూవారి మాదిరిగానే గురువారం పాఠశాలకు వెళ్లారు. తరగతి గదిలో ఫ్యాన్‌ రెక్కలు ధ్వంసం చేశారనే కారణంతో పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్‌రెడ్డి, విజరుప్రకాష్‌ ముగ్గురు విద్యార్థులను మందలించి, దండించారు. అలాగే మహిళా పోలీస్‌కు సమాచారం అందించారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పాఠశాల సామగ్రిని ధ్వంసం చేసిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు విద్యార్థులను పొలీస్‌ స్టేషన్‌ సెల్‌లో ఉంచి ఓ కానిస్టేబుల్‌ కర్రతో చేతులు, తొడలపై కొట్టారని విద్యార్థులు తెలిపారు. అలాగే మరుగుదొడ్లు శుభ్రం చేయించే ప్రయత్నం చేయగా సరిపడు నీరు లేకపోవడం వల్ల ఆ పని చేయలేదని వివరించారు. మధ్యాహ్నం భోజనానికి కూడా పంపలేదని వాపోయారు. సాయంత్రం ఏడు గంటలకు విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన, హామీ మేరకు విడిచిపెట్టారని తెలిపారు. అలాగే పోలీస్‌ కానిస్టేబుల్‌ కర్రతో కొట్టడం వల్ల కాలు వాపు వచ్చిన విద్యార్థిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించామని తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై ఎంఎల్‌సి నమోదు చేసినట్లు ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఉపాధ్యాయులను నిలదీశారు. తమ పిల్లలు పొరపాటు చేస్తే తమకు చెప్పకుండా పొలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లడంపై మండిపడ్డారు. తమ పిల్లలు జరిగిన అవమానానికి మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని అవేదన వ్యక్తం చేశారు.
ఎంఇఒ విచారణ
విద్యార్థులను అమానుషంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంపై మండల విద్యాశాఖ అధికారి బి.రాముడు విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను దండించడం, పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించడం సరికాదని తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది ఎవరూ తనకు ఎలాంటి సమాచారమూ తెలియజేయలేదన్నారు. ఈ సంఘటనపై సంబంధిత ఉపాధ్యాయులను అడిగితే పాఠశాలలో ఫ్యాన్లను కొందరు విద్యార్థులు ధ్వంసం చేస్తున్నట్లు చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న ముగ్గురు విద్యార్థులను మందలించి కౌన్సెలింగ్‌ ఇప్పించడానికి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లామని సంబంధిత ఉపాధ్యాయులు బదులిచ్చారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంఇఒ తెలిపారు.
విద్యార్థులను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన సంఘటనపై స్థానిక తహశీల్దార్‌ స్లీవజోజి విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు తహశీల్దార్‌ బాధిత విద్యార్థి కుటుంబాల వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. ఫ్యాన్‌ రెక్కలు ధ్వంసం చేశారనే కారణంతో ఉపాధ్యాయులు సుధాకర్‌ రెడ్డి, విజయ ప్రకాష్‌ తమను కొట్టారని విద్యార్థులు తెలిపారు. అంతేకాక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఓ కానిస్టేబుల్‌ కర్రతో కొట్టారని తహశీల్దార్‌కు వివరించారు. ఓ విద్యార్థి తన తొడకాలిపై ఉన్న గాయాన్ని చూపించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని తహశీల్దార్‌ తెలిపారు.
విద్యార్థులను నిర్బంధించలేదు :డిఎస్‌పి
విద్యార్థులను పోలీస్‌ స్టేషన్లో నిర్బంధించలేదని డిఎస్‌పి కెవి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటనపై స్పందిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులను పోలీస్‌ స్టేషన్లో ఉంచినట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు.పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది కేవలం విద్యార్దులకు అవగాహన మాత్రమే కల్పించారని తెలిపారు. ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారన్న భయంతో విద్యార్థులు అలా ఆరోపించారని వివరించారు. స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వలేదని, కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. సమా వేశంలో సిఐ బాలసురేష్‌ బాబు, ఎస్‌ఐ సాగర్‌బాబు పాల్గొన్నారు.