Mar 13,2021 07:35

    తెలుగు రాష్ట్రాల్లో పేద, మధ్యతరగతి ప్రజలను ఒకప్పుడు అప్పుల ఊబిలోకి నెట్టేసి అధిక వడ్డీలు బాదేసి అంతులేని అక్రమాలకు పాల్పడిన మైక్రో ఫైనాన్సింగ్‌ సంస్థల తరహాలో...ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ వేదికగా రుణాలిచ్చే యాప్స్‌ రూపంలో నిలువు దోపిడి యథేచ్ఛగా సాగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. 'అత్యవసరంగా డబ్బు కావాలా? ఆధార్‌ ఉంటే చాలు. క్షణాల్లో డబ్బు మేమిస్తాం. ఒక క్లిక్‌తో రుణం పొందండి' వంటి ఆకర్షణీయమైన ప్రకటనలతో సామాజిక మాధ్యమాల్లో వల విసిరి సూక్ష్మ రుణాల ఊబిలోకి లాగేస్తున్న ఈ యాప్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈజీ మనీ కోసం చిన్నపాటి కమీషన్లకు కక్కుర్తిపడి లోన్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయించడం, రుణాలు ఇప్పించడం, మళ్లీ వాటిని వసూలు చేసి సదరు యాప్‌ సంస్థలకు చెల్లించడం వంటి పనులు చేస్తూ యువత మైక్రో ఫైన్సానింగ్‌ ఉచ్చులో చిక్కుకుపోతోంది.
   'ఆధార్‌' ఉంటే చాలు..ఆదాయ ఆధారాలేమీ అక్కర్లేదంటూ మొదట వల విసిరే ఈ కంపెనీలు భారీ వడ్డీలు గుంజుతున్నాయి. మొదట్లో చిన్న చిన్న మొత్తాలకు ఈ యాప్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రజలు ఆ తర్వాత ఆ కంపెనీలు పెట్టే షరతులన్నిటినీ అంగీకరిస్తూ అడిగిన పత్రాలన్నీ అప్‌లోడ్‌ చేసి వాటి విష వలయంలో చిక్కుకుపోతున్నారు. వినియోగదారులుగా రుణ గ్రహీతలు సమర్పించే వ్యక్తిగత సమాచారాన్ని రుణ మంజూరు సంస్థలకు, క్రెడిట్‌ కార్డు సంస్థలకు అమ్మేస్తూ కూడా సదరు లోన్‌ యాప్స్‌ కంపెనీలు లాభాలు దండుకుంటున్నాయి.
   గతంలో మైక్రో ఫైనాన్సింగ్‌ కంపెనీలు కాలనాగుల్లా జనాలను దోచుకున్న నేపథ్యంలో రిజర్వుబ్యాంకు అప్పట్లో వాటి నియంత్రణకు కొన్ని నిబంధనలను, మార్గదర్శకాలను తీసుకొచ్చిన విషయం విదితమే. అయితే ఆన్‌లైన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తున్న లోన్‌ యాప్స్‌ మాత్రం ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. కొన్ని యాప్స్‌ అయితే యజమాని ఎవరు? ఏ దేశంలో ఆ సంస్థ కార్యాలయం ఉంది? ఇలాంటి ప్రాథమిక సమాచారం కూడా ట్రేస్‌ చేయడానికి వీలుపడటం లేదు.
   తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆన్‌లైన్‌ మైక్రోఫైనాన్స్‌ కేసులో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు చేపట్టిన దర్యాప్తు విస్తుపోయే అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్‌ తొమ్మిది ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ ఇలాంటి మైక్రో ఫైనాన్స్‌ యాప్స్‌ ద్వారా ప్రజలను దోచుకుంటున్న బాగోతం బయటపడింది. ఇతనితో ముడిపడివున్న లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ.300 కోట్ల మొత్తాన్ని జప్తు చేశారు. ఒక వ్యక్తి నుంచే ఆ సంస్థలు ఇన్ని లావాదేవీలు నెరిపితే ఇక ఈ లోన్‌ యాప్స్‌ ముఠా ఇంకెన్ని వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కొల్లగొడుతోందో అర్థం చేసుకోవచ్చు.
   పరిమిత కెవైసి డాక్యుమెంటేషన్‌తో రుణాలు ఇవ్వడం, అధిక వడ్డీలు వసూలు చేయడం ద్వారా ఈ యాప్‌ సంస్థలు లాభాలు గడిస్తున్నాయి. డబ్బులు కట్టడం ఆలస్యమైతే వాటి ప్రతినిధులు వివిధ నెంబర్లతో ఫోన్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తారు. వీరి వేధింపులు భరించలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంతటి ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఇప్పటికి 16 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. బెంగళూరు, హర్యానా, గుర్గావ్‌, ఢిల్లీ తదితర నగరాల్లో ప్రధాన కేంద్రాలుగా చేసుకొని ఈ ఆన్‌లైన్‌ రుణ సంస్థల ముఠాలు పనిచేస్తున్నాయి.
  ప్రజల గొంతుక వినిపించేందుకు వేదికగా సామాజిక మాధ్యమాలపైనా, ప్రత్యామ్నాయ వార్తా సంస్థల వెబ్‌ పోర్టళ్లపైనా ఆంక్షల కత్తి నూరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలను నిలువునా దోచుకుంటున్న మైక్రో ఫైనాన్సింగ్‌ యాప్స్‌ ఆగడాలు కనిపించకపోవడం విడ్డూరం. ఆన్‌లైన్‌ లాటరీలు, రమ్మీ వంటి ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్స్‌ ఏ విధంగా ప్రజలను దోచుకున్నాయో చూశాం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, రిజర్వుబ్యాంకు స్పందించి ఆన్‌లైన్‌ రుణాల యాప్స్‌ కంపెనీలను నియంత్రించాలి. ఆన్‌లైన్‌ లాటరీలను నిషేధించినట్లుగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మైక్రో ఫైనాన్సింగ్‌ యాప్‌ను నిషేధించే విషయం పరిశీలించాలి.