ప్రజాశక్తి-అమృతలూరు: పేదలకు భూమి లేకుండా ఆత్మ గౌరవం రాదని నమ్మిన గొప్ప వ్యక్తి, దార్శనికుడు బాపన య్య అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొనిగల అగస్టీన్ అన్నారు. శనివారం, అమతలూరు, మండలం, కూచిపూడిలో బాపనయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అగస్టీన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా నాగాయతిప్పలో దళిత కుటుంబంలో జన్మించారని, చిన్నతనంలోనే కుల వివక్షను ఎదుర్కొన్నాడని, కుల వివక్ష పోవాలంటే దళితులకు భూములు రావాలని చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా అలుపెరగని భూపోరాటాలు చేశారన్నారు. ప్రజల కోసం అనేక కష్టాలు పడ్డారని, జమిందారుకు వ్యతిరేకంగా మంగళపురం బంజరు భూముల పోరాటం సందర్భంగా లాఠీలతో కుళ్లబొడిచినా, గుర్రాలతో తొక్కించినా ఏనాడూ తాను ఎంచుకున్న పోరాట బాటను వీడలేదన్నారు. ఆయన అడుగు జాడలలో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో చావలి రమేష్, కూచిపూడి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.










