Jun 22,2021 06:58

   ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్న వైసిపి సర్కారు, అధికారంలోకొచ్చిన రెండేళ్లకు మొన్న శుక్రవారం విడుదల చేసిన తొలి క్యాలెండర్‌లో దార్శనికత లేకపోగా పలాయనవాదం గోచరించింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవనని టిడిపి ప్రభుత్వం ప్యాకేజికి తాకట్టు పెట్టిందని తామొస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని యువతలో వైసిపి ఆశలు రేకెత్తించింది. ఇప్పుడేమో మాట మార్చి కేంద్రంలో బిజెపికి సంపూర్ణ మెజార్టీ వచ్చింది కాబట్టి దేవుడు కరుణించి పరిస్థితులు మారేంత వరకు కేంద్రాన్ని అడగటం తప్ప చేసేదేమీ లేదని స్వయాన ముఖ్యమంత్రే దైవ కటాక్షాన్ని కోరారు. హోదా లేదు కనుక గడచిన రెండేళ్లల్లో ఆశించినంతగా ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యం కాలేదనడం చేతులెత్తేసే ఎత్తుగడ. విభజన నష్టాలకు గురైన రాష్ట్రానికి హోదా అత్యవసరమన్న విషయం ఎంత నిజమో, అదొక్కటే మొత్తం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాబోదన్నదీ అంతే నిజం. హోదా ఉన్నంత మాత్రాన ఇబ్బడిముబ్బడిగా పరిశ్రమలు రావు. పరిశ్రమలు నెలకొల్పే వారు మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, మార్కెట్‌ ఇత్యాది అంశాలన్నింటినీ బేరీజు వేసుకుంటారు. ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై ఆలోచించకుండా హోదా రానందువల్లనే ఉద్యోగ కల్పన వీలుపడలేదనడం ఆలీబాబా అద్భుత దీపం చేతికందితే అద్భుతాలు చేస్తామనడం వంటిది. ఒక వైపు రాష్ట్రానికి హోదా అవసరాన్ని నొక్కివక్కాణిస్తూ, మరో వైపు ద్రోహం చేసిన బిజెపిని నిలదీసి పోరాటం చేయడానికి వెనుకంజ వేయడం వైసిపి అవకాశవాదానికి అద్దంపడుతుంది.
    ఆలస్యంగా వెల్లడించిన ఉద్యోగ క్యాలెండర్‌లో ప్రభుత్వ ఆత్మస్తుతి ప్రస్ఫుటిస్తోంది. ఆరు లక్షల పైచిలుకు కొత్త ఉద్యోగాలిచ్చామన్న వాదన అసంబద్ధమైనది. నాలుగు లక్షల గ్రామ వలంటీర్లను, సర్కారులో విలీనమైన ఆర్‌టిసి ఉద్యోగులను కొత్త ఉద్యోగాలుగా పేర్కొనడం ప్రభుత్వ వైపరీత్యం. లక్షన్నర వరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ నిజం. ఈ కాలంలో ప్రభుత్వంలో భర్తీ చేసిన కొత్త పోస్టులు ఇవి తప్ప మరేవీ లేవు. రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులుండగా లక్షన్నర మందికి ఉద్యోగాలిచ్చి, ఇదే ఎక్కువ అనడం ఆత్మవంచన. ఎన్నికలకు ముందు 2.30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామనగా, కడకు రెండేళ్ల తర్వాత పది వేల పోస్టుల భర్తీకి క్యాలెండర్‌ విడుదల చేసి ఈ ఏడాదికి ఇక ఇంతేనంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికో డిఎస్‌సి అన్న ప్రభుత్వం, జాబ్‌ క్యాలెండర్‌లో ఆ ప్రస్తావన చేయలేదు. పోలీస్‌శాఖలో ఏడు వేల పోస్టులు భర్తీ చేస్తామని హోం మంత్రి చెప్పగా, జాబ్‌ క్యాలెండర్‌లో 470కి పరిమితం చేశారు. కోవిడ్‌ అత్యవసర సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్‌ చేసే నర్సులనూ జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొనడం సర్కారీ గిమ్మిక్కు.
    పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే జ్యూట్‌ రంగం రాష్ట్రంలో ఖాయిలా పడింది. దానిని తెరిపించే యోచన ఏదీ ప్రభుత్వానికి లేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, నిర్మాణ రంగం కునారిల్లుతున్నాయి. వాటిని ఆదుకునే విధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు 35కి పైగా ఉన్నాయి. వాటి ఆస్తులను తాకట్టు పెట్టడం గురించి ఆలోచిస్తున్నారు తప్ప వాటికి ఊతం ఇచ్చే ప్రయత్నం లేదు. సహకార వ్యవస్థ ఉపాధి కల్పనకు తోడ్పడే మరో రంగం. ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండానే ఈ రంగాలపై దృష్టి సారిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నవ్యాంధ్రలో విస్తారమైన సముద్ర తీరం, అపార సహజ వనరులు, అమూల్యమైన మానవ వనరులు ఉన్నప్పటికీ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం వద్ద విజన్‌ కరువైంది. పైపై మాటలతో ఉపాధి కల్పన జరిగేది కాదు. ప్రభుత్వానికి దృఢ చిత్తం అవసరం. ఆ దిశగా ప్రభుత్వాన్ని కదిలించాల్సింది యువతే.