Oct 18,2021 06:45

తెలుగు సాహిత్య వైతాళికుల్లో గుంటూరు శేషేంద్ర శర్మది ప్రత్యేకమైన స్థానం. ఆయన స్థానం ఏమిటో స్వయంగా నిరూపించుకోవటమే కాదు, కవిసేన మేనిఫెస్టో ద్వారా ప్రతి వర్ధమాన కవీ తన స్థానం ఏమిటో, ఎలా ఉండాలో చర్చించి మరీ తన తర్వాత తన ఖాళీని, ఏ కవి అయినా సరే వైజ్ఞానికంగా పూరించాలని తపన పడ్డాడు. కానీ ఇవాళ పేరుకోసం తపనపడే వాళ్లు శేషేంద్ర కవిత్వాన్ని మక్కికి మక్కి అనుసరించటం కాదు, ఆయన కవిత్వాన్నే ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా దించేసి కాలర్‌ ఎత్తుకొని తిరుగుతున్నారు. అది వారి తప్పు కాదు. శేషేంద్ర తన కవిత్వ మాయాజాలం ద్వారా మరొకరు మరోవిధంగా రాయలేకుండా చెరగని ముద్రవేసి ఆకాశంలోకో, మబ్బులోకో ఈ దేవ నదుల్లోకో తరలి వెళ్ళిపోయాడు..., ఒక మహాశూన్యం నింపేసి మరీ. ఎన్నో మహావాక్యాలు అందించి మరీ. పైగా కవిసేన మేనిఫెస్టో ద్వారా ఆధునిక కావ్యశాస్త్రం లక్షణాలు, లక్షితాలు వివరించి మరీ. అందుకే శేషేంద్ర ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికుడు.
శేషేంద్ర బతికి ఉండగానే తెలుగు కవులు కవిత్వం నినాదమయం చేసి, ఎలా రాయాలో తెలియక దారి తప్పుతుంటే చాలా బాధపడ్డాడు. అందుకు కవిత్వం ఎలా ఉండాలో, ఎలా రాయాలో, ఎలా రాయకూడదో సుదీర్ఘంగా తన కవిసేన మేనిఫెస్టోతో సవివరంగా, బాధాతప్త హృదయంతో చర్చించాడు. దారి చూపించాడు. విప్లవం కవిత్వం గ్రూపులుగా విడివడి, కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో అసలు కవిత్వం ఏ దారిలో, ఎలా నడవాలో పున:సమీక్షించాడు. సుదీర్ఘంగా, ఓపికతో, కోపంతో, వివేకంతో, ఆవేశంతో, అనేకానేక ఉటంకింపులతో, సోదాహరణంగా తన ప్రతిపాదనలను శాస్త్రీయంగా వెలువరించాడు. ఆనాడు అంటే 1977 ప్రాంతాలకు కవిసేన మేనిఫెస్టోని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఇవ్వాల్సిన గౌరవం, విలువ ఇవ్వకపోగా పైగా ఆయన సాహిత్య పరిశీలనని ఎద్దేవా చేశారు. అవహేళన చేశారు. శేషేంద్ర తిరుగుబాటుతో కూడిన అనేకానేక శాస్త్రీయ ప్రతిపాదనలను మూల్యాంకనం చేయకుండా నిరాకరించి తోసి రాజనటం తెలుగు సాహిత్యంలో జరిగిన చారిత్రక ద్రోహం. ఆనాడు యూనివర్సిటీలు కూడా గమ్మున కూర్చున్నాయి. అది ఈనాటికీ ఓ మహాపుస్తకం - కవిసేన మేనిఫెస్టో పట్ల ఎంతో ఉదాసీనత ఆవరించి ఉంది. దాన్ని పటాపంచలు చేయాల్సిన బాధ్యత మన విమర్శకుల మీద ఎంతో ఉంది.
అందుకే కవిసేన మేనిఫెస్టోని, అందులోని భావజాలాల్ని మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏ విమర్శనా గ్రంథానికి గ్రహణం పట్టకూడదు. అది సాహిత్యం వెనుకబాటుతనానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే ప్రతి గొప్ప గ్రంథానికి ప్రాసంగికత ఉంటుంది. దాన్ని విస్మరించకూడదు. కవిసేన మేనిఫెస్టోలో శేషేంద్ర ఒంటిచేత్తో అలవిమాలిన పని పెట్టుకున్నాడు. పెనుభారాన్ని తలకెత్తుకున్నాడు. తన శాయశక్తులూ ధారపోసి సంభాషణా శైలితో, వాగ్ధారతో, తర్కంతో తను సమకూర్చుకున్న సమస్త శాస్త్రాలంకారాలు గుమ్మరించాడు. ఒకసారి వర్తమాన సాహిత్యాన్ని ఎద్దేవా చేశాడు. ఆవేశించాడు. కోపంతో కుమిలిపోయి ఆనాటి కవుల్ని విమర్శిస్తూ తిట్టాడు.
శేషేంద్రలోని నవ్య కవిత్వ తత్త్వసారాన్ని గ్రహించకుండా మతతత్త్వ లేబుల్స్‌ తగిలించారు. ఆయనలోని మార్క్సిస్టు భావజాలాన్ని తలకిందులు చేసి చూపించాలని ఆరాటపడ్డారు. ఆదరించాల్సిన కవిసేన మేనిఫెస్టోని దాని ఆవశ్యక ఉద్యమ వాదాన్ని తిరస్కరించారు.
నిజానికి, శేషేంద్ర తన మేనిఫెస్టోలో ఈ శిరోధార్యమైన భావాలు పంచాడు. కొత్త కవులకి ఏది కవిత్వమో, మంచి కవిత్వ లక్షణాలు, ప్రపంచ వ్యాపిత కవిత తీరుతెన్నులూ సవివరంగా అందించాడు. కవిత్వం రాయాలనే తపన ఉన్న ప్రతి సామాజిక జీవికి ఎంతో ఆక్సిజన్‌ అందించే అభిప్రాయాలు కవిసేన మేనిఫెస్టో ఈనాటికీ మోస్తోంది. సౌందర్య శిల్పశాస్త్రం ఎలా ఉంటుందో శేషేంద్ర తన ముక్తకాలతో నింపి మరీ కవిసేన మేనిఫెస్టో రూపొందించాడు.
శేషేంద్ర కవిత్వ రీతిలో అత్యంత ఆధునికుడు. ప్రపంచ సాహిత్యం నేల మాళిగలని దున్నిన చదువరి. పారశీక కవుల హృదయాలని పట్టుకున్న గొప్ప ప్రేమికుడు. ఆ వ్యవహారాలన్నింటిని ఏకరువు పెట్టి ఉద్యమ స్ఫూర్తికి పట్టుకొమ్మగా ఈ గ్రంథం అవతరించింది. ఒకవిధంగా శేషేంద్రలోని అత్యాధునికుడి కోణమూ కవిసేన మేనిఫెస్టోలో చూడవచ్చు. అందుకే శ్రీశ్రీ తర్వాత ఏది రాసినా కవిత్వంగా చెలామణి చేయగలిగిన ధైర్యం శేషేంద్రలో కనిపిస్తుంది. అంతేకాదు యావత్తు ప్రపంచ సంక్షేమం కోసం, పీడితుల పక్షాన నిలబడి ఒక వైజ్ఞానిక నాయకత్వం కోసం తపించాడు.
''కవి సమాజంలో సర్వవిధ వైజ్ఞానిక తరగతులకు ఏకైక ప్రతినిధి'' అంటాడు శేషేంద్ర. కవిత్వం ఒక ఆత్మకళగా అభివర్ణించాడు. ఫ్రెంచికవులు రేంబో, బోదిలేర్‌ దగ్గర్నించి, గోర్కీ ప్లెఖనోవ్‌, షెర్బీనా, మయకోవ్‌స్కీ దాకా ప్రాచీన ఆలంకారికులు పాణిని, భవభూతితో ఆగక, వాల్మీకి నుంచి గాలిబ్‌ దాకా పయనించి వారి సిద్ధాంతాలు ఎంత ఆచరణీయమో కవిసేన మేనిఫెస్టోలో చర్చించి దానిని ఆధునిక కావ్యశాస్త్రంగా సారభూతం చేశాడు. దార్శనికుడు శేషేంద్ర కవిసేన మేనిఫెస్టోలో కవిత్వ సమాజానికిచ్చిన సూచనలు కొన్ని పరిశీలిద్దాము.
- విశిష్టమైన భావం, విశిష్టమైన భాష తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదు.
- కవిత్వంలో అనుభూతే సర్వధా ముఖ్యం. అనుభూతిలోనుంచే కవిత్వం అంటే అలంకారాలు, బింబాలు, ప్రతీకలు పుడతాయి.
- కవిత్వతత్త్వం తెలియని వాళ్లు కవిత్వం వేరు, టెక్నిక్‌ వేరు అనుకుంటారు.
- ప్రతి కవితా ఎలా ఉండాలి? ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. ఒక మరణాస్త్రంలో ఉండాలి.
- నిజమైన కవులు తయారు కావాలని ఇవాళ కవిసేన అరుస్తోందంటే ఒక కొత్త మనుషుల గుంపు తయారు కావాలని పిలుస్తోందన్నమాట.
ఈ విధంగా కవిసేన మేనిఫెస్టో శేషేంద్ర కావ్యదర్శనం ఆవిష్కరించాడు. ప్రతిభ, సమాధి, వ్యుత్పత్తి కవి సమగ్రంగా ఎలా సాధించాలో శేషేంద్ర సులభగ్రాహ్యంగా వివరించాడు. ప్రాక్‌, పశ్చిమ కావ్యంతత్త్వ చింతనతోపాటు, ఆధునిక, మార్క్సిస్ట్‌ చింతనతో నవ్య ఆధునిక కవిత్వానికి తన కావ్యశక్తిని అందించాడు. శేషేంద్రని పట్టించుకుంటే తెలుగు సమాజం మరింతగా తలెత్తుకొని తిరుగుతుంది. శేషేంద్ర జీవితాంతం తల ఎత్తుకొనే బతికాడు. కవిత్వాన్ని, విమర్శని, తత్త్వ చింతనని అనితర సాధ్యంగా ధారపోశాడు.
(అక్టోబరు 20 : గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి)
                                                     - సాగర్‌ శ్రీరామకవచం    - 98854 73934