
దారి పొడవునా గుంతలే...
- ఏళ్ల తరబడిగా మరమ్మతులకు నోచని రహదారులు
- ఇటీవల వర్షాలకు కుంటలను తలపిస్తున్న వైనం
- ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు
- చోద్యం చూస్తున్న పాలకులు, అధికారులు
ప్రజాశక్తి - రుద్రవరం
రహదారులు ప్రగతికి బాటలు, అభివృద్ధికి చిహ్నాలని చెప్పుకునే ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతలమయం కావడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు దెబ్బతిన్న రహదారులపై ప్రయాణం నరకయాతనగా మారింది.
రుద్రవరం మండలంలోని ఆర్‌అండ్‌బి రోడ్లతో పాటు మందలూరు, చందలూరు మీదుగా ఆళ్లగడ్డకు వెళ్లే ప్రధాన రహదారి, నాగిరెడ్డిపల్లె నుంచి దాదాపు 5 కిలోమీటర్లు రోడ్డు పేరూరు వరకు, చిన్నకంబలూరు మెట్ట నుండి 3 కిలోమీటర్లు, సిరివెళ్ల మార్గమధ్యలోని ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి దెబ్బతిని దారుణంగా మారింది. ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారుల్లో వాహనదారులు, ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేయాల్సి ఉంది. గుంతలమయమై రహదారులు అధ్వానంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందలూరు నుంచి చందలూరు మీదుగా మాచినేని పల్లె వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలు పడింది. పేరూరు నుండి నాగిరెడ్డి పల్లె మీదుగా మండల కేంద్రం రుద్రవరం చేరుకోవాలన్నా, ఆళ్లగడ్డకు పనుల నిమిత్తం వెళ్లాలన్నా గుంతలమయమైన ప్రధాన రహదారిలో ప్రయాణం సాగించాల్సి ఉంది. చిన్నకంబలూరు-సిరివెళ్ల మార్గమధ్యలో, రుద్రవరం నుండి నరసాపురం ప్రధాన రహదారి కంకర తేలి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అలాగే ఈ గ్రామాల పరిధిలోని రైతులు, కూలీలు పంట పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారులు దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా అటు పాలకులు గానీ ఇటు సంబంధిత అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రయాణికులు, వాహనదారులు, ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
వర్షాలకు కుంటలను తలపిస్తున్న రహదారులు
ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీళ్లు నిలిచాయి. దీంతో రహదారి కుంటలను తలపిస్తున్నాయి. రహదారిలో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కొందరు క్షతగాత్రులు అవుతుండగా, మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనల ఉన్నాయి. అనేక సందర్భాల్లో పాలకులు, జిల్లా అధికారులు మండలంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. రహదారులను చూసీ చూడనట్లే వెళ్ళిపోతుంటారు తప్ప మరమ్మతులపై దృష్టి సారించిన దాఖలాలు లేవని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో సమావేశాలు, సభలు నిర్వహించిన సందర్భాలలో పాలకులు రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు చేపడతారని మాటలు చెబుతున్నారే తప్పా సంవత్సరాలు గడుస్తున్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయే తప్ప రహదారులు మాత్రం మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు స్పందించి రహదారుల మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు, ఆయా గ్రామాల రైతులు, కూలీలు, ప్రజలు కోరుతున్నారు.
ప్రజా ప్రతినిధులకు ప్రజల ఇబ్బందులు కనబడటం లేదు
ప్రజల ఇబ్బందులు ప్రజాప్రతినిధులకు కనపడడం లేదు. ఓట్లప్పుడు మాత్రమే అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటారు. చందలూరు, మందలూరు రోడ్డు దెబ్బతిని ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డుపై నీరు నిలవడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో గుర్తించలేక వాహనాలు అదుపుతప్పి కింద పడి కాళ్లు, చేతులు విరుగుతున్నాయి. అధికారులు, నాయకులు రోడ్లకు నిధులు కేటాయించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి.
- బోయ రమణయ్య, యువకుడు, చందలూరు గ్రామం.
ఎక్కడ చూసినా మోకాటి లోతు గుంతలే...
మాచినేనిపల్లె గ్రామం నుంచి చందలూరు, మందలూరు గ్రామాల మీదుగా ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె రోడ్డు వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు గుంతలు ఉన్నాయి. ఈ దారి వెంట ప్రయాణం చేయాలంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. ఎప్పుడు ఏ గుంతలో పడతామో తెలియదు. రోడ్డు మరమ్మతులు చేయించాలి.
- లింగమయ్య ,రైతు. చందలూరు.
చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నాయి..
నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను. రోడ్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి. నాయకులు, అధికారులు రోడ్లపై ఇలాగే వస్తూ ప్రయాణం చేస్తున్నారు. వారికి మా ఇబ్బందులు కనపడటం లేదు. రోడ్డు మరమ్మతులు మాత్రం చేపట్టడం లేదు. కొత్త రోడ్లు వేయాలి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
- శివ, మందలూరు గ్రామం.
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
మాచినేని పల్లె గ్రామం నుంచి చందలూరు, మందలూరు గ్రామాల మీదుగా ఆళ్లగడ్డకు వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్లు గుంతలమయం అయ్యాయి. విద్యార్థులు పాఠశాలలకు ఎన్నో ఇబ్బందులు పడి వెళ్లాల్సి వస్తుంది. రోడ్డుకు నిధులు కేటాయించి వెంటనే మరమ్మతులు చేయించాలి.
- రవి, చందలూరు గ్రామం.