ప్రజాశక్తి- సీలేరు
జీకే.వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని దారాలమ్మ అమ్మవారి ఆలయంలో దోపిడీ దొంగలు బుధవారం అర్ధరాత్రి అమ్మవారి నగలు, హుండీలోని నగదు అపహరించుకుపోయారు. దారాలమ్మ ఆలయం వెనుక భాగంలో గ్రిల్స్‌ను బుధవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు చాకచక్యంగా కట్ చేసి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, హుండీలో నగదును అపహరించుకుపోయారు. బుధవారం తెల్లవారుజామున మహిళ ఆలయం చుట్టుపక్కల పరిశుభ్రం చేయడానికి వెళ్ళగా వెనుక భాగంలో ఉన్న గ్రిల్స్ కట్ చేసినట్లు గుర్తించి తన భర్తకు చెప్పింది. ఆయన ఆలయ ప్రధాన అర్చకుడు నారాయణమూర్తికి తెలియజేశారు. వెంటనే ఆయన ఆలయం వద్దకు వచ్చి తాళాలు తెరిచి ఆలయంలోకి వెళ్లి చూడగా అమ్మవారి నగలుతో పాటు హుండీ పగలగొట్టి డబ్బులు అపహరించినట్లు గుర్తించారు. దీనిపై చింతపల్లి ఎఎస్‌పి, జికె.వీధి సీఐకు సమాచారం ఇచ్చారు. ఎఎస్‌పి కొమ్ము ప్రతాప్ శివ కిషోర్, సిఐ అశోక్ కుమార్, ఎస్‌ఐ అప్పలసూరి, సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సిఐ అశోక్ కుమార్ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు సమాచారం ఇచ్చి దోపిడీ దొంగలపై నిఘా పెట్టాలని సూచించారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణమూర్తిని, ఆలయం చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి సంఘటన తీరుపై ప్రశ్నించి ఆరా తీశారు. నేలమ్మ ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించవచ్చని భావించగా, దొంగలు సీసీ కెమెరాల డివిఆర్‌ను కూడా అపారించుకుపోయారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ బృందాలను రంగంలో దింపారు. ఈ సందర్భంగా సిఐ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎండోమెంట్ ఈవో సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 19 గ్రాములు బంగారు ఆభరణాలు, హుండీలో కొంత నగదు అపరిచిపోయినట్లు వెల్లడించారు. ఎండోమెంట్ అధికారి సాంబశివరావు మాట్లాడుతూ దారాలమ్మ ఆలయాన్ని 2020లో ఎండోమెంట్ పరిధిలోకి వచ్చిందని, అప్పట్లో 19 గ్రాముల బంగారం, కొంత నగదు అప్పజెప్పారని, ఈ రెండేళ్లలో అదనంగా అమ్మవారి కానుకలు తమ దృష్టికి రాలేదని వెల్లడించారు.
ఎండోమెంట్ అధికారిపై గ్రామస్తుల ఆగ్రహం
ఎండోమెంట్ అధికారి సాంబశివరావుపై దారకొండ ఆలయ తాత్కాలిక కమిటీ నాయకులు, గ్రామస్తులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన నిర్లక్ష్యం కారణంగానే అమ్మవారు నగలు దొంగల పాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుకుల్ని భద్రపరచాలని ఎన్నిసార్లు చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం సీఐ అశోక్ కుమార్ కలగజేసుకొని సముదాయించారు. ఈ కార్యక్రమంలో క్లూస్ టీం ఎస్‌ఐ రహీం తదితరులు పాల్గొన్నారు.










