
ఇంకా జరగని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం
గోదావరి జలాలపై తర్జనభర్జనలు
సీలేరు, పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వలపైనే ఆధారం
రెండు జిల్లాలకు దాదాపు 70 టిఎంసిలు అవసరం
ఖరీఫ్‌లో కరువుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
దాళ్వాసాగుకు నీటి సరఫరాపై ఇప్పటికీ ప్రభుత్వం తేల్చలేదు. ఖరీఫ్ మాసూళ్లు ప్రారంభమయ్యాయి. దాళ్వా నారుమడులు వేసేందుకు మరోపక్క రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ దాళ్వాలో సాగునీటికి సంబంధించి జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జరగనేలేదు. పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరిస్తారా.. లేక ఆంక్షలు ఏమైనా విధిస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాళ్వాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆయకట్టు పరిధిలో 4.36 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రెండు జిల్లాల్లోనూ దాళ్వాసాగుకు పూర్తిస్థాయిలో నీరందించాలంటే 70 టిఎంసిల వరకూ నీరు అవసరం. వరద నీటి ప్రకారం గోదావరి నుండి లభ్యత అంచనాలు 36 టింఎంసిల వరకూ ఉండే అవకాశం ఉంది. సీలేరు నుంచి ఎంత లభ్యత ఉంటుందో, పోలవరం ప్రాజెక్టు వద్ద నిల్వ ఉన్న నీటిని దాళ్వాకు ఉపయోగించేందుకు ఇరిగేషన్ అధికారులు లెక్కలు కడుతున్నట్లు తెలుస్తోంది. సాగునీటికి సంబంధించి లెక్కలపై స్పష్టత వస్తే తప్ప దాళ్వా పరిస్థితి ఏమిటో అర్థం కాదు. కొంతకాలంగా వంతులవారీ విధానంలో దాళ్వాకు సాగునీరు అందిస్తున్నారు. జనవరి దాటిన తర్వాత సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాల విభజన అనంతరం రెండు జిల్లాల్లో దాదాపు 3.50 లక్షల ఎకరాల వరకూ దాళ్వాలో వరి సాగవుతోంది. ఈ సాగుకు నీరెలా అందిస్తారో ప్రణాళికలు ఇప్పటికీ వెల్లడించకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ సాగులో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. దిగుబడులపై సైతం తీవ్ర ప్రభావం పడనున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ తరుణంలో దాళ్వాలో సాగునీటి ఇబ్బందులు తలెత్తితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడనుంది. దాళ్వాలో సాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కష్టాల సుడిలో అన్నదాత
ఖరీఫ్‌లో వర్షాలు పడక పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఏలూరు జిల్లాలో లక్షా 98 వేల ఎకరాల్లో వరిసాగు సాగగా ప్రాథమిక అంచనాల్లో 12 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు స్పష్టమైంది. ఇంకా పరిస్థితి మరింత దారుణంగా ఉండనుందని తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ జిల్లాలో ఏఒక్క మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఖరీఫ్‌లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండల తీవ్రతకు దిగుబడులు తగ్గనున్నట్లు రైతులు అంచనా వేస్తున్నారు. దీంతో దాళ్వా సాగుపైనే రైతులంతా గంపెడాశలు పెట్టుకున్నారు. దాళ్వాసాగుకు నీటి సరఫరాపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అప్పుడే రైతులు ప్రశాంతంగా ఉంటారు. ఈ నెల 14న ఏలూరు జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశం జరగనున్నట్లు చెబుతున్నా అధికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. దాళ్వాకు సాగునీటిపై ఇరిగేషన్ జిల్లా అధికారి వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.