Nov 04,2022 23:43

  • రబీకి నీరివ్వలేమని తేల్చిన జిల్లా సాగునీటి సలహా మండలి
  • ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం శూన్యం
  • రైతుల్లో నిరాశ !

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
రబీలో దాళ్వాసాగుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. వరుసగా రెండో ఏడాదీ దాళ్వాకు నీరివ్వలేమని జిల్లా సాగునీటి సలహామండలి స్పష్టం చేసింది. దీంతో వరి మినహా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం లేని చౌడు భూముల్లో రెండో పంట వేసుకునే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్లో 4.35 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నల్లరేగడి నేలలు అపరాల సాగుకు అనుకూలం. ఈ భూముల్లో అత్యధిక విస్తీర్ణంలో రబీలో రెండో పంటగా వరి కోతల సమయంలో అపరాలు వెదజల్లుతారు. కొన్ని ప్రాంతాల్లో బోర్ల కింద మొక్కజొన్న, జొన్న సాగుచేస్తున్నారు. మచిలీపట్నం, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్ను తదితర సముద్ర తీర మండలాల్లోని 60 వేల ఎకరాల్లో క్షారభూములున్నాయి. ఈ భూముల్లో రెండో పంటగా దాళ్వా సాగు మినహా మరో ప్రత్యామ్నాయం పంటలు వేసే పరిస్థితిలేదు. ప్రభుత్వం సాగునీరు విడుదల చేయలేమని చెప్పడంతో ఈ భూముల రైతులు ఒక పంటసాగుతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు పంటలు పండించిన రైతులకే అరకొరగా వచ్చే ఆదాయాలు... పెరిగిన ధరలతో కుటుంబాలు నెట్టుకు రావడం కష్టంగా మారింది. ఒకపంటతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
దాళ్వా లేదు సరే... ఇతర పంటలకు ప్రణాళికేదీ ?
రెండో పంటగా అపరాలతోపాటు మొక్కజొన్న, జొన్న తదితర పంటల సాగుకు నల్లరేగడి భూములు అనుకూలం. అపరాలకు తేలికతడులు, మొక్కజొన్న, జొన్న పంటల సాగుకు ఆరుతడులు నీరు అవసరం ఉంటుంది. ఈ పంటలకు నీటి విడులపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులంతా అపరాలు వెదజల్లుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కృష్ణమ్మ పరవళ్లు
పులిచింతలలో నీటిని నిల్వ చేయకముందే కృష్ణాడెల్టాకు సాగునీరు ఇచ్చిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. అక్టోబర్‌, నవంబర్లలోనూ కృష్ణానదికి వరద నీరు పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు విడుదల చేయగా 1400 క్యూసెక్కుల నీటిని శుక్రవారం సముద్రంలోకి విడుదల చేశారు. ప్రాజెక్టుల్లో దాళ్వాసాగుకు అవసరమైన నీరులేదని జిల్లా యంత్రాంగం ప్రకటించడం రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.