Sep 24,2023 00:16

నిరసన తెలుపుతున్న కెవిపిఎస్‌ నాయకులు, దళితులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : డాల్ఫిన్‌ హోటల్‌లో పనిచేస్తున్న దళిత కార్మికుడు డి.సత్యాన్ని కులం పేరుతో దూషించిన సూపర్‌వైజర్‌ను తక్షణం శిక్షించాలని కుల వివక్ష పోరాట సమితి (కెవిపిఎస్‌) గౌరవాధ్యక్షులు వై.రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎల్‌ఐసి సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కెవిపిఎస్‌ ఆధ్వర్యాన శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డి.సత్యాన్ని కులం పేరుతో తిట్టిన సూపర్‌వైజర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు హోటల్‌ యాజమాన్యం ముగ్గురు దళిత కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించిందన్నారు. సూపర్‌వైజర్‌ కులం పేరుతో తిట్టినట్లు పోలీసుల దర్యాప్తులో రుజువైనప్పటికీ యాజమాన్యం సూపర్‌వైజర్‌ను శిక్షించకుండా బాధితులను బెదిరించి ఉద్యోగానికి రాజీనామా చేయించిందని విమర్శించారు. సంవత్సర కాలంగా ఈ వ్యవహారం లేబర్‌ కోర్టులో విచారణ సాగుతుందన్నారు. అక్రమంగా తొలగించిన కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని, సూపర్‌వైజర్‌ను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జగదాంబ జోన్‌ కార్యదర్శి ఎం.సుబ్బారావు, ఎం.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.