వినుకొండ: రాష్ట్ర ప్రభుత్వం ఆస్థుల రిజిస్ట్రేషన్ విధానంలో నూతనంగా తీసుకొస్తున్న కార్డ్ ప్రైమ్ 2.0పై డాక్యుమెంట్ రైటర్లు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం కార్డ్ ప్రైమ్ 2.0ను ప్రజలు, కక్షిదారులపై రుద్దు తుందని అన్నారు. కార్డు ప్రైమ్ 2.0 సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్థులకు భద్రత ఎలా సాధ్యమని రైటర్ల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్ వినుకొండలో డాక్యుమెంట్ రైటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్డ్ 2.0పై ప్రభుత్వ విధానాన్ని ఆయన రైటర్లకు వివరించారు. ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం కల్పించకుండా ఆఘమేఘాల మీద నూతన సాఫ్ట్‌వేర్‌ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా డాక్యుమెంట్ రైటింగవత్తిపై ఆధారపడిన రైటర్లకు ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్డ్ ప్రైమ్ 2.0 ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లో ఒరిజినల్ దస్తావేజులు కక్షిదారులకు రాకపోవటం వలన భవిష్యత్ ఇబ్బందులు తలెత్తుతా యన్నారు. నూతన విధానంపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటంతోపాటు, వారి సందేహాలను నివత్తి చేశాకే అమలు చేయాలని కోరారు. భద్రత లేని రిజిస్ట్రేషన్ల వైపు ప్రజలు ఎలా మొగ్గుచూపుతారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేణుగోపాల్ ప్రశ్నించారు. ప్రభుత్వ విధానంపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైటర్లు కరపత్రాలు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో వినుకొండ డాక్యుమెంట్ రైటర్లు, వారి సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.










