
ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రైమ్-2 విధానం రద్దుచేయాలంటూ డాక్యుమెంట్ రైటర్లు బుధవారం పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆనందపురం : దస్తావేజులు తయారీలో నూతన విధానం ప్రైమ్-2 ద్వారా డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోతారంటూ ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనందపురం మండల దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏనుగులు సత్యారావు మాట్లాడుతూ, తాము ఉపాధి కోల్పోవడమే కాకుండా దస్తావేజులు డిజిటల్ ద్వారా కొన్ని సమస్యలు తలెత్తుతాయని, రూ.కోట్లలో కొనుగోలు చేసిన ఆస్తులకు సరైన రక్షణ లేకుండా పోయే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మరిపిల్ల ప్రసాదరావు, వేణుగోపాల్, ఉప్పాడ నవీన్, జగదీష్, రవికుమార్, పార్థసారథి, గణేష్, శివాజీ, సంతోష్ పాల్గొన్నారు.
పెందుర్తి : ముసిడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు నలబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ వృత్తిపై ఆధారపడి ఎంతోమంది బతుకుతున్నారని, నూతన పాలసీ తీసు కొచ్చి పొట్ట కొట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు.
భీమునిపట్నం : దస్తావేజు లేఖర్లు బుధవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేషగిరిరావు, కామేశ్వరరావు, లక్ష్మి, భానుప్రకాష్, సుబ్రహ్మణ్యం, సాయి తది తరులు పాల్గొన్నారు
విశాఖ కలెక్టరేట్ : ప్రైమ్ సాఫ్ట్‌వేర్ 2.0ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు దస్తావేజు లేఖర్లు టర్నర్ చౌల్ట్రీకి ఎదురుగా ఉన్న రిజిస్టర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. విధులు బహిష్కరించి, నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మజ్జి మురళి, ఎస్.షణ్ముఖరావు నాయకత్వం వహించారు.
యలమంచిలి:కంప్యూటరైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (కార్డ్) విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు బుధవారం సమ్మెకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేఖర్ల ప్రమేయం లేకుండా సెప్టెంబరు 15 నుండి నేరుగా రిజిస్ట్రేషన్లు చేయడానికి చేస్తున్న ప్రభుత్వ విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని తెలిపారు. యలంమచిలిలో సుమారు 54 కుటుంబాలు రోడ్డు పడనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిళ్లా నాగేశ్వరరావు, శెలంశెట్టి సాగసాయి, ఆర్లె ఉమ, శానాపతి రాము, తమ్మిశెట్టి వరలక్ష్మి ఉన్నారు. దీనిపై సబ్ రిజిస్ట్రార్ ఎం.అప్పారావును వివరణ కోరగా, సెప్టెంబరు 15 నుండి నేరుగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రోజూ కనీసం సుమారు 25, 30 రిజిస్ట్రేషన్లు చేసేవాళ్లమని, సమ్మె కారణంగా కేవలం మూడు మాత్రమే చేశామని చెప్పారు.
సబ్బవరం : ప్రభుత్వం నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయొద్దని, దస్తావేజుల లేఖర్ల జీవనోపాధికి గండి కొట్టొద్దని కోరుతూ దుర్గమాంబ దస్తా వేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యాన సబ్బవరం మండల కేంద్రంలో పెన్‌డౌన్ కార్యక్రమం బుధవారం చేపట్టారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ ఎంవి.రత్నకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శేఖరమంత్రి శ్రీనివాసరావు, భిక్కవల్లి రాంబాబు, వల్లభజోస్యుల సీతారామమూర్తి, బొగ్గారపు రత్నాజీ, బోకం ఈశ్వరపాలవెల్లి, జూరెడ్డి రామమూర్తి, రావాడ చంద్రశేఖర్, వడిసెల దేముడు తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి:రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నూతనంగా అమలు చేయనున్న సాఫ్ట్ వేర్ కార్డ్ ప్రైమ్ 2.0 ను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్ల రాష్ట్ర యూనియన్ 30, 31 తేదీల్లో పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టాలని పిలుపు మేరకు స్థానిక దస్తావేజు లేఖర్లు బుధవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ వైబోయిన రమణ తమ మద్దతును ప్రకటించారు. దస్తావేజు లేఖర్లతో కలిసి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నూతన రిజిస్ట్రేషన్ పద్ధతిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కొత్త పద్ధతిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు చిన్న కృష్ణమూర్తి, దాతారం మురళీకృష్ణ, దస్తావేజు లేఖర్లు, సహాయకులు నవర వెంకట రమణ, పంపరబోయిన లోవరత్నం, వెలగా లోకేష్ పాల్గొన్నారు..
నర్సీపట్నం టౌన్: నూతన రిజిస్ట్రేషన్ విధానంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని దస్తావేజు లేఖర్లు స్థానిక ఐదు రోజుల జంక్షన్‌లో వినాయక ఆలయం వద్ద బుధవారం పెన్ డౌన్ సమ్మె చేపట్టారు.ఈ సందర్భంగా దస్తవేజు లేఖరులు మాట్లాడుతూ, ప్రైమ్ -2 విధానంను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.దస్తావేజు లేఖర్లు చేస్తున్న ఈ సమ్మె కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర మద్దతు పలికారు.నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నాయకులు మారిశెట్టి రాజా, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ కొత్తకోట రామశేఖర్ తో పాటు దస్తావేజు లేఖర్ల సంఘం నర్సీపట్నం అధ్యక్షులు సున్నం చిదంబరస్వామి, వైస్ ప్రెసిడెంట్ నరం సన్యాసినాయుడు, సెక్రటరీ శివకుమార్, వాణి, కన్నబాబు, సత్తిబాబు పాల్గొన్నారు.
కోటవురట్ల:దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద బుధవారం చేపట్టారు. నూతనంగా చేపట్టిన 2.0 వల్ల దస్తావేజు లేఖలతో రోడ్డున పడే అవకాశం ఉన్నట్లు ధర్నాలో పాల్గొన్న వారు తెలిపారు.