Sep 08,2023 19:06

ప్రజాశక్తి - కాళ్ల
              డాక్టరేట్‌ పట్టా రావడంతో మరింత బాధ్యత పెరిగిందని సంఘ సేవకులు, అవార్డు గ్రహీత డి.నిరీక్షణరాజు అన్నారు. మండలంలోని కోపల్లె గ్రామంలో డాక్టరేట్‌ అవార్డు గ్రహీత డి.నిరీక్షణరాజుకు శుక్రవారం ఘనంగా సత్కారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నిరీక్షణరాజు తన సంపాదనలో కొంత సొమ్మును సామాజిక, ఆధ్యాత్మిక సేవలకు తన వంతు సాయం చేస్తున్నారన్నారు. ఆక్వా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కరోనా సమయంలో మొదటి, రెండు దశల్లో వందలాది మంది కార్మికులకు రూ.లక్షల విలువైన కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించారన్నారు. అంబేద్కర్‌ జయంతి, వర్థంతి వేడుకలు ప్రతి ఏడాది నిర్వహిస్తూ పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. నిరీక్షణరాజు చేస్తున్న సేవలను గుర్తించి రాజస్థాన్‌లోని సన్‌రైజ్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ అవార్డు అందించిందన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత నిరీక్షణరాజు మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్‌ రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ సామాజిక సేవలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అయిమ్‌ రాష్ట్ర నాయకులు బల్లా రామకష్ణ, పి.సాల్మన్‌, జిల్లా కో-కన్వీనర్‌ నాగరాజ్‌, యండగండి సర్పంచి మూర్తి, జల్లి కాకినాడ సర్పంచి నాగరాజు, భీమవరం జిల్లా టౌన్‌ అధ్యక్షులు గండి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు మానుకొండ కిషోర్‌, దాసి ప్రసాద్‌బాబు, మారంపూడి రాజా, శ్యాంకుమార్‌, కొండేటి జాన్‌, స్మిత్‌ కెనడీ, యాకోబు, పలు గ్రామాల నుంచి అయిమ్‌ నాయకులు, కోపల్లె గ్రామస్తులు పాల్గొన్నారు.