May 20,2023 19:53

పోలీసు స్టేషన్‌ ముందు మాట్లాడుతున్న జనసేన నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన ఇన్‌ఛార్జీ మల్లప్ప హెచ్చరించారు. జనసేన కార్యకర్త విజరు కుమార్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శనివారం టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లప్ప మాట్లాడారు. ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్‌ రెడ్డి, వైసిపి ఇన్‌ఛార్జీ జయ మనోజ్‌ రెడ్డిపై సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులూ పెట్టకపోయినా తమ కార్యకర్త విజరు కుమార్‌పై భౌతిక దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. గత వారం రోజులుగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై వ్యక్తిగత దూషణలు చేస్తూ కుటుంబ సభ్యులపై కూడా అధికార పార్టీ సోషల్‌ మీడియా సభ్యులు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని తెలిపారు. వైసిపి నాయకునిపై సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడితే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తూ తమ కార్యకర్తలు, నాయకులను భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పారు. గతంలో మహేష్‌ యాదవ్‌పై కూడా దాడి చేశారని, పోలీసులు సూచన మేరకు కేసు రాజీ అయ్యామని తెలిపారు. ఆ ఘటన మరువక ముందే ఎస్‌కెడి కాలనీలోని ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్న విజరు కుమార్‌పై రాజు, గోపి, కార్తీక్‌లు భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. గాయాలపాలైన విజరుకుమార్‌ను ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించామన్నారు. ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశామన్నారు. బాధితుడు విజరు కుమార్‌, నాయకులు రాజశేఖర్‌, రేణువర్మ, చిరుత రాజశేఖర్‌ ఉన్నారు.