Oct 21,2023 20:26

కడప నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లిములు, ప్రజాసంఘాల నాయకులు

 కడప అర్బన్‌ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులను ఆపి శాంతిని నెలకొల్పాలని ముస్లిమ్‌ మతపెద్దలు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఖండిస్తూ నగరంలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో శనివారం శాంతియుత భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నబికోట నుంచి ప్రారంభమై పాతబస్టాండ్‌, నాగారాజుపేట, ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ మీదుగా ఏడు రోడ్ల కూడలికి చేరుకుంది. ర్యాలీలో భారతదేశ జాతీయ జెండాతో పాటు పాలస్తీనా జాతీయ జెండా రెపరెపలాడాయి. భారత ప్రభుత్వం పాలస్తీనాకు మద్దతు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏడు రోడ్ల వద్ద ర్యాలీని ఉద్దేశించి సలావుద్దీన్‌, అమీర్‌బాబు, చంద్రశేఖర్‌, ఈశ్వరయ్య, మత పెద్దలు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుని దాడులను ఆపాలని కోరారు. ఇప్పటికే 5వేల మంది అమాయక ప్రజలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ర్యాలీలో సంఘసేవకులు సయ్యద్‌ సలావుద్దీన్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, టిడిపి కడప నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జీ అమీర్‌బాబు, టిడిపి సీనియర్‌ నాయకులు లక్ష్మిరెడ్డి, జమీల్‌, నాసర్‌ అలీ, సిపిఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య, రాజకీయ పార్టీలు, పిడిఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, మతగురువు జాకీర్‌ హుస్సేన్‌, అలీఖాన్‌, మగ్బుల్‌ బాష, కార్పొరేటర్‌ షఫి, జెకె యూత్‌ ఖాదర్‌బాష, మాజీ కార్పొరేటర్‌ జమాల్‌ వలి, మతపెద్దలు పాల్గొన్నారు.