ప్రజాశక్తి-అరకులోయ :1/70 చట్టం అమలు చేయాలని, గిరిజన నేతరుల అక్రమ కట్టడాలపై నిజాయితీగా పోరాడుతున్న ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.కృష్ణారావు, ఇతర నాయకుల పై హుకుంపేట సర్పంచ్, వైసిపి నాయకులు భౌతిక దాడి చేయడం అమానుసమని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ అన్నారు. ఈ దుర్మార్గపు చర్యను అందరు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలదేవ్ మాట్లాడుతూ,హుకుంపేట మండల కేంద్రంలో గిరిజ నేతరుల అక్రమ కట్టడాలపై పోరాటం చేస్తున్నామన్నారు. హుకుంపేట సర్పంచ్, వైసీపీ నాయకులు గిరిజననేతరుల అక్రమ కట్టడాలకు బినామీలుగా ఉండి చట్టాలు కాలరాస్తున్నారన్నారు. ఈ విషయమై పోరాడుతున్న ఆదివాసి గిరిజన సంఘం నాయకులపై భౌతిక దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. గిరిజ నేతరులకు బినామీలుగా వ్యవహరిస్తూ ఆదివాసుల హక్కులు, చట్టాలు నిర్వీర్యం చేస్తూ పాలన కొనసాగిస్తామంటే ఆదివాసి గిరిజన సంఘం చూస్తూ ఊరుకోదని, దాడి చేసిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ దాడిని ఆదివాసి మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం అరకువేలి మండల కార్యదర్శి పి.రామన్న, మండల నాయకులు నాని బాబు, బుజ్జిబాబు, బాలకృష్ణ, జోషి, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు: ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా ఉపాధ్యక్షుడు తాపూల కృష్ణారావుపై ప్రత్యేక్ష దాడికి పాల్పడిన సర్పంచ్ వెంకట పూర్ణిమ, అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శిలు ఎంఎం శ్రీను, కె.నర్సయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పంచాయతీలో కొంత మంది పెద్దలతో అక్రమ నిర్మాణలపై పూర్ణిమలు తీర్మానం చేసి విడుదల చేశారన్నారు. గిరిజన ప్రజా శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్న నాయకులపై వైసీపీ దుండగులను రెచ్చగొట్టి దాడికి పాల్పడడం సరికాదన్నారు. పూర్ణిమ అనుచరు లపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అల్లూరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
డుంబ్రిగుడ:హుకుంపేట మండలంలో గిరిజన సంఘం అల్లూరి జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణారావుపై దాడికి పాల్పడిన సర్పంచ్ పూర్ణిమతో పాటు ఆమె అనుచరులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరంతరం గిరిజన సంఘం పోరాటం చేస్తుందన్నారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలినీ లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.










