Nov 06,2022 22:29

ప్రజాశక్తి-నందిగామ
చంద్రబాబు కాన్వాయిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం నందిగామ పోలీస్‌ స్టేషన్‌ వద్ద టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడిపై దాడి చేసి ఆయన ముఖ్య భద్రత అధికారి కట్టమంచి మధుసూదనరావు రక్తగాయములకు కారణమైన నిందితులను గుర్తించి తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దాదాపు సంఘటన జరిగి 48 గంటలు, కంప్లైంట్‌ ఇచ్చి 24 గంటలు గడుస్తున్న పోలీసుల నిరంకుశ వైఖరి మాత్రం మారలేదన్నారు. పోలీసుల వైఖరిని తప్పు పడుతున్నామని తెలిపారు. ఒక చిన్న పోస్ట్‌ పెడితేనే పరిగెత్తుకొచ్చే సిఐడి అధికారులు జెడ్‌ ప్లస్‌ కేటగిరి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద దాడి చేస్తే కనీసం స్పందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోట వీరబాబు,కోగంటి బాబు, టిడిపి కౌన్సిలర్లు కామసాని సత్యవతి, మండవ కష్ణకుమారి, మేకల సువార్త,ఏచూరి రాము,వీరంకి వీరాస్వామి పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.