Nov 13,2023 20:23

సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీరాజా

 కడప అర్బన్‌ ఉపాధ్యాయులు ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో దాచుకున్న డబ్బులను ప్రభుత్వం దోచుకుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు పేర్కొన్నారు సోమవారం యుటిఎఫ్‌ భవన్‌లో ప్రాంతీయ మండలాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయి పడ్డ ప్రతి రూపాయి సకాలంలో చెల్లిస్తామని హామీలు గుప్పించారని తెలిపారు. అధికారం చేపట్టాక ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ప్రభుత్వంలో భాగం కాదనే విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్య, వైద్యం, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రతినెలా జీతంలో పొదుపు రూపంలో దాచుకున్న పిఎఫ్‌ సొమ్మును ప్రస్తుతం అనారోగ్యం ఇతరత్రా సమస్యల కారణంగా వాడుకోవడానికి అవకాశం లేకుండా గత మార్చి నుంచి ఒక్క రూపాయి కూడా విదల్చకుండా ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల దారుణంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏపీ జిఎల్‌ఐ బకాయిలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలు పూర్తిగా అందని ద్రాక్ష లాగా మారిపోయాయని తెలిపారు. దసరా, దీపావళి సందర్భంగానైనా వాటిని మంజూరు చేస్తారని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ఉపాధ్యాయులు బకాయిలు రాకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయి పడ్డ సొమ్ములను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేపట్టి ప్రభుత్వం మెడలు వంచైనా తమకు రావాలసిన న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి పోరాట పంథాను ఎంచుకుని సాధించుకుంటా మని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శి ఏజాస్‌ అహ్మద్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు చంద్రశేఖర్‌, వీరనారాయణ, శ్రీనివాసులు, నాగిరెడ్డి, పార్థసారథి, గోపీనాథ్‌, శివరామకష్ణమరాజు పాల్గొన్నారు.