ఏడాది క్రితం ఫిబ్రవరి 14న జమ్ము-కాశ్మీర్ లోని శ్రీనగర్ వద్ద పుల్వామా అనే గ్రామం గుండా కేంద్ర రిజర్వు సాయుధ బలగాలు పోతున్నప్పుడు వారిపై ఉగ్రవాదులు జరిపిన దాడి, అందులో 40 మంది జవాన్లు మృతి చెందడం, ఆ వెంటనే ప్రతీకార చర్యగా పాకిస్తాన్ లోని బాలాకోట్ వద్ద ఉన్న (లేదా, ఉన్నట్టు భావించిన) ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు జరిపిన మెరుపుదాడి (సర్జికల్ స్ట్రైక్) ఇంకా మనందరకూ గుర్తుంది. ఆ సర్జికల్ స్ట్రైక్ జరిపిన తర్వాత మోడీని అన్ని రాజకీయ పక్షాలవారూ అభినందించారు. ఒక మొనగాడు మన దేశ ప్రధాని అని మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఆ తర్వాత రెండు నెలలకే జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బిజెపి తిరుగులేని మెజారిటీతో మళ్ళీ గెలిచింది.
ఆనాటి నుంచీ తొలగని సందేహాలు
ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టడానికి, వారి కుట్రలను భగం చేయడానికి భారత నిఘా వర్గాలు నిరంతరం తమ డేగ కన్ను జమ్ము-కాశ్మీర్ ప్రాంతంలో తెరిచే వుంచుతాయి. అటువంటిది, సుమారు 350 కిలోల పేలుడు పదార్ధంతో ఒక ఆత్మాహుతి దాడి శ్రీనగర్ కు సమీపంలోనే జరిగిందంటే ఆ నిఘా వర్గాలకు ఎటువంటి సమాచారమూ లేదా? ఇది నిఘా వర్గాల వైఫల్యమా?
ఇదే విషయాన్ని ఒక ప్రశ్న రూపంలో అడిగితే, దానికి రాజ్యసభలో 2019 జూన్ 16న సమాధానం ఇస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంటలిజెన్స్ వర్గాల వైఫల్యం ఏమీ లేదని, వివిధ నిఘా బృందాలు నిరంతరం ఎప్పటికప్పుడు తెలిసిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూనే వున్నాయని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ నేత దిగ్విజరు సింగ్ తనకు ఫిబ్రవరి 8న అందిన ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికను ట్విట్టర్‌లో పోస్టు చేస్తే ఆ పోస్టును తొలగించారని ఆరోపించారు. పుల్వామా వద్ద దాడి జరిగేందుకు అవకాశం ఉందన్న సమాచారం ఆ ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలో ఉంది. పుల్వామా వద్ద దాడి జరగడానికి 6 రోజులముందే ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉందన్న సంగతి దిగ్విజరుసింగ్ ఆరోపణ ద్వారా బోధపడుతోంది.
''ఈ దాడి వలన ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారు?'' అంటూ 2020 ఫిబ్రవరి 14న, దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వెంటనే అమరవీరులను రాహుల్ అవమానపరిచాడని అతడిపై బిజెపి నేతలంతా విరుచుకుపడ్డారు. ఇటీవల ఒక వాట్సప్ లీక్ ద్వారా బిజెపి-అనుకూల న్యూస్ యాంకర్ అర్ణబ్ గోస్వామి పుల్వామా దాడి వార్త తెలియగానే ''మనం పిచ్చ పిచ్చగా గెలవబోతున్నాం'' అని తన సంబరాన్ని ఫోను ద్వారా పంచుకున్న సంగతి బైటపడింది. దానిమీద ఇంతవరకూ ఏమీ నోరిప్పకుండా అర్ణబ్ తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉన్నాడు.
ఎక్కడో తేడాగా ఉన్నట్టు అనిపిస్తోంది కదా!
సతీష్ మిశ్రా అబ్జర్వర్ రిసెర్చి ఫౌండేషన్ కి గౌరవ ప్రొఫెసర్‌గా వస్తూంటారు. ఆయన 2019 మార్చి 5వ తేదీనే ఈ విధంగా రాశారు- ''40 మందికి పైగా భద్రతాదళాల సైనికులు చంపబడడం భగవంతుడు మోడీకి పంపిన కానుకగా పరిణమించింది. ఎందుకంటే ఆనాటికి బిజెపి రాజకీయ భవిష్యత్తు వేగంగా దిగజారిపోతోంది. ఇక విషాదాన్ని రాజకీయ అవకాశంగా మలచుకోవడంలో మోడీది అందెవేసిన చెయ్యి. మామూలు పౌరుడైతే ఈ విషాదవార్త తెలియగానే దు:ఖంలో మునిగిపోతాడు. కాని మోడీ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా జనసామాన్యపు సెంటిమెంటును రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే పనిలో పడ్డాడు''.
2019 మార్చి 11న న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాసింది: ''ఆర్ధికాభివృద్ధి మందగిస్తోంది. వేలాదిమంది రైతులు దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలలో ఉన్నారు. నిరుద్యోగం గత 45 ఏళ్ళ లోకెల్లా అతి ఎక్కువ స్థాయికి చేరింది....కాని కాశ్మీర్‌లో పేలిన ఒక్క బాంబు ...మోడీ పతనానికి అడ్డుపడింది.'' సందేహం ఇంకా పెరిగింది కదూ?
ఏడాదిపాటు అన్వేషణ-వెలుగు చూస్తున్న నిజాలు
2019 జనవరి 2 నుండి 2019 ఫిబ్రవరి 13 (దాడి జరిగిన ముందురోజు) మధ్యలో కనీసం 11 సందర్భాల్లో ఇంటలిజెన్స్ వర్గాలు అటువంటి ఒక ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికను ప్రభుత్వానికి తెలియజేశాయి. ఇది ప్రముఖ పక్ష పత్రిక 'ఫ్రంట్‌లైన్' ఏడాదిపాటు సాగించిన పరిశోధనలో వెలుగు చూసింది.
భద్రతా దళాలు ప్రయాణం చేసే దారిలో ఉగ్రవాద దాడి జరగవచ్చునన్న ముందస్తు సమాచారం నిఘా వర్గాలకు, వారి నుండి ప్రభుత్వానికి అందింది. జైష్-ఎ-మహమ్మద్ దళ కమాండర్ ముదసర్ అహమ్మద్ ఖాన్ మరో నలుగురు విదేశీ ఏజంట్లతో కలిసి త్వరలోనే ఒక పెద్ద ఆత్మాహుతి దాడికి పథకం రూపొందిస్తున్నట్టు, ఆ బృందం శ్రీనగర్ సమీపంలోని మిదూరా, లామ్ త్రాల్ గ్రామాల సమీపంలో సంచరిస్తున్నట్టు నిఘా వర్గాలు జనవరి చివరి వారంలోనే పసిగట్టాయి.
''ఖిసస్'' దాడులు- ఉగ్రవాదుల ప్రతీకార వ్యూహం
2017లో భారత ప్రభుత్వం ''ఆపరేషన్ ఆలౌట్'' ప్రారంభించింది. ఏ ఒక్క ఉగ్రవాదినీ మిగల్చకుండా అంతం చేయడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ ఆపరేషన్‌లో 2017 నవంబరు 6న జైష్-ఎ-మహమ్మద్ చీఫ్‌గా ఉన్న మసూద్ అజర్ మేనల్లుడు తల్హా రషీద్, అతనితోబాటు పాక్ ఉగ్రవాది మహమూద్ భారు, పుల్వామాకు చెందిన వాసిం అహ్మద్ భద్రతా దళాల చేతుల్లో ఒక ఎన్‌కౌంటర్‌లో మరణించారు. జనవరి 2018లో మసూద్ అజర్ మరో బంధువు మరణించాడు. అందుకు ప్రతీకారంగా తలపెట్టినవే ఈ ఖిసస్ దాడులు. 2013లో ఉరితీయబడిన అఫ్జల్ గురు (పార్లమెంటుమీద దాడి చేసిన ఉగ్రవాది) మొదటగా ఈ ఖిసస్ మిషన్ అనే పదాన్ని వాడాడు.
ఘాజీ అబ్దుల్ రషీద్ అనే పాక్ జాతీయుడైన ఉగ్రవాది ఈ ఖిసస్ కి నాయకుడు. ముదసర్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఇతగాడు పుల్వామా దాడికి పథకరచన చేశాడు. ఖిసస్ మిషన్ లక్ష్యాన్ని ప్రకటిస్తూ పోస్టర్లు వెలిశాయి.
స్పష్టంగా పసిగట్టిన నిఘా వర్గాలు
- 2019 జనవరి 7 నిఘావర్గ నివేదిక ప్రకారం ముగ్గురు
ఉగ్రవాదులు స్థానిక యువకులను చేరదీసిఒక విదేశీ ఉగ్రవాది నేతృత్వంలో ఐఇడి లను (ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్) తయారుచేసి అమర్చే శిక్షణ చేపట్టారు.
- 2019 జనవరి 18 నిఘా వర్గ నివేదిక ప్రకారం పుల్వామా జిల్లాలో అవంతిపురా ప్రాంతంలో విదేశీ కుట్రదారులతో స్థానిక యువకులు తోడైనట్టు, వారి కదలికలు వేగం పుంజుకున్నట్టు ధృవపడింది.
- 2019 జనవరి 21 నిఘావర్గ నివేదిక ఖిసస్ దాడి త్వరలోనే జరిగే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరించింది. ఈ దాడి మసూద్ అజర్ మేనల్లుడు తల్హా రషీద్ హత్యకు ప్రతీకారంగా చేపట్టినట్టు కూడా ఆ నివేదిక తెలిపింది.
-2019 జనవరి 24, 25 తేదీలలో వచ్చిన నివేదికలు ముదసర్ అహ్మద్ ఖాన్, షామిద్ బాబా అనే మరో ఉగ్రవాదితో కలిసి ఈ దాడులకు నాయకత్వం వహిస్తున్నట్టు తెలిపాయి.
-2019 ఫిబ్రవరి 9 న జరగబోతున్న దాడి గురించి మరొక నివేదిక వచ్చింది. ఈ సమాచారం జమ్ము-కాశ్మీర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కి కూడా అందించారు.
- 2019 ఫిబ్రవరి 12న ''షా గెట్ 313 ఎట్ 313 గెట్'' అన్న ట్విట్టర్ హ్యాండిల్ గురించి నిఘా వర్గాలు ''టాప్ సీక్రెట్, మేటర్ మోస్ట్ అర్జెంట్'' అని సూచిస్తూ నివేదిక పంపాయి. జైష్ ఉగ్రవాదులు జనవరి నుండే ఈ ట్విట్టర్ హ్యాండిల్‌ను పాకిస్తాన్ నుండి నడుపుతున్నట్టు తెలిపాయి. భద్రతా దళాలు ప్రయాణించే దారులలో ఐఇడి బ్లాస్ట్‌లను ప్లాన్ చేసినట్టు కూడా ఈ నివేదికలో తెలిపారు.
- 2019 ఫిబ్రవరి 13న జమ్ము, కాశ్మీర్ గుండా ప్రయాణించే భద్రతా దళాలపై ఐఇడి దాడులు జరుగుతాయన్న హెచ్చరికను మళ్ళీ నిఘా వర్గాలు పంపాయి.
ఈ నివేదికలు కీలక కుట్రదారుడైన ముదసర్ అహ్మద్ ఖాన్ కదలికల గురించి, ఆత్మాహుతి దాడాలు జరగబోతున్న విషయం గురించి స్పష్టంగానే పేర్కొన్నాయి. భద్రతా దళాలు ప్రయాణం చేసే మార్గాలలో ఈ దాడులను తలపెడుతున్నట్టు కూడా తెలిపాయి.
ముదసర్ అహ్మద్ ఖాన్‌ను ఎందుకు ఉపేక్షించారు?
ఈ ముదసర్ అహ్మద్ ఖాన్ తక్కువవాడేమీ కాదు. చాలా ఉగ్రవాద దాడులలో అతని హస్తం ఉన్నట్టు సమాచారం ఉంది. 2017లో లేత్‌పురాలో సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై దాడి చేసి అయిదుగురి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఆ దాడికి సూత్రధారి ముదసర్. 2018లో సుంజువాన్ ఆర్మీ క్యాంప్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు సైనికులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. ఆ దాడి వెనుక కూడా ముదసర్ అహ్మద్ ఖాన్ ముఖ్యపాత్ర పోషించాడు. 2019 ఫిబ్రవరి 1న భద్రతా దళాలు షహీద్‌బాబాను అంతమొందించాక అతడి బృందానికి కూడా ముదసర్ నాయకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ వివరాలన్నీ నిఘా వర్గాలు అధికారులకు అందించాయి. అన్నిటికీ మించి ముదసర్ అహ్మద్ ఖాన్ స్థానికుడు. ఒకసారి ఒక స్థానికుడు ఉగ్రవాద చర్యలతో సంబంధాలు కలిగివున్నాడన్న విషయం ధృవపడితే, ఆ తర్వాత అతడి ఆనుపానులు తెలుసుకోవడం, అతడిని పట్టుకోవడం గాని అంతం చేయడం గాని పెద్ద కష్టమేమీ కాదు.
ఫిబ్రవరి 14 పుల్వామా దాడి తర్వాత మార్చి 11న ముదసర్ అహ్మద్ ఖాన్ ట్రాల్ వద్ద పింగ్లిష్ అనే గ్రామంలో తుపాకీ కాల్పులలో చంపివేయబడ్డాడు.
జనవరిలోనే అతడి కుట్రల గురించి, కదలికల గురించి వివరమైన సమాచారం ఉన్నా. ముదసర్ ముందు నుంచీ వాంటెడ్ లిస్టులో ఉన్నా, అతడిని ముందే ఎందుకు పట్టుకునే ఆదేశాలు ఇవ్వలేదు? ఈ ప్రశ్నకు అధికారుల నుండి సమాధానం లేదు.
భద్రతా దళాలు ప్రయాణం చేసే దారుల్లో ఆత్మాహుతి దాడులకు కుట్రలు జరుగుతున్నాయని ముందే అధికారులకు తెలుసు. అయినా 78 వాహనాలలో 2547 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను రోడ్డు మార్గం గుండా పంపారు. మరీ ముఖ్యంగా ఆ ముందురోజు అంత స్పష్టంగా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఎందుకు ఆ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోలేదు? ఒకవేళ కిందిస్థాయి అధికారులదే బాధ్యత అయినట్టైతే వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకూ సమాధానం లేదు.
మస్తుగా రాజకీయ ప్రయోజనం పొందిన బిజెపి
ముందస్తుగా దాదాపు నెలా పదిహేను రోజుల నుండీ నిఘా వర్గాల నివేదికలు హెచ్చరిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం పుల్వామా దాడి జరిగిన వెంటనే హడావుడి ప్రారంభించింది. ప్రధానితో సహా బిజెపి, ఆరెస్సెస్ వర్గాలు రంగంలోకి దిగి పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న వాదనను ముందుకు తెచ్చాయి. దేశ ప్రజల భావోద్వేగాలను బాగా రెచ్చగొట్టడానికి ఈ సంఘటనను ఉపయోగించుకున్నాయి.
ఆ తర్వాత ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారతీయ వైమానిక దళాలు అకస్మాత్తుగా దాడి చేసిన సందర్భాన్ని కూడా అదేవిధంగా ఉపయోగించుకుని ఆ సర్జికల్ స్ట్రైక్ ఘటనను మోడీ నాయకత్వపు సామర్ధ్యానికి ఉదాహరణగా చూపించాయి. మీడియా ఈ సందర్భాలను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. బలప్రదర్శనతో, ''మన సత్తా ఏమిటో అవతలివాళ్ళకు చూపించాం'' అనే డంబంతో బిజెపి ముందుకు తెచ్చిన జాతీయ వాదపు నమూనా 2019 ఎన్నికలలో ఆ పార్టీకి పెద్ద మెజారిటీని తెచ్చిపెట్టింది.
2014-2019 మధ్య కాలంలో మోడీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు (ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చకపోవడం, పెద్ద నోట్ల రద్దుతో తెచ్చిన తిప్పలు, ఉద్యోగాల కల్పనలో తీవ్ర వైఫల్యం, రైతులకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం, సామాజిక న్యాయం అమలులో వైఫల్యం వగైరా) అన్నీ ఈ కండబలపు జాతీయవాదంతో కొట్టుకుపోయాయి.
ప్రజలకు సమాధానం కావాలి
అంత దేశభక్తి ఉన్న వారు, ఉగ్రవాదుల్ని ఏరిపారేయడానికి కంకణం కట్టుకున్న వారు, తమను విమర్శించే వారంతా దేశద్రోహులో, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవాళ్ళో అని ఆరోపించి కేసులు బనాయించే వారు, పొరుగుదేశంపై సర్జికల్ దాడులు జరపగల సత్తా ఉన్నవారు, ఇంత ముందస్తు సమాచారం ఉన్నా నెలా పదిహేను రోజులపాటు ఎందుకు కదలలేదు? ఇదీ 'ఫ్రంట్‌లైన్' పరిశోధన మళ్ళీ ముందుకు తెచ్చిన ముఖ్యమైన ప్రశ్న. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే, కావాలనే, అంత పెద్ద సంఖ్యలో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్లను రోడ్డు మార్గాన పంపారా అన్నది ఇంకో ప్రశ్న. అర్ణబ్ గోస్వామి వాట్సప్ సంభాషణ బైటపడిన తర్వాత అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది నిఘావర్గాల వైఫల్యం కాదని పార్లమెంటులో కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అది సరైనదే. నిఘా వర్గాలు ముందుగానే పలుమార్లు హెచ్చరించాయి. మరెటువంటి జాగ్రత్తలూ తీసుకోలేదంటే అది ప్రభుత్వపు వైఫల్యం కాదా? 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్ల ప్రాణాలు గాలిలో కలిసిపోడానికి బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.
- కార్తికేయ










