
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ జంక్షన్ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట, మూడు లాంతర్లు, గంటస్థంభం మీదుగా రాజీవ్ క్రీడా మైదానం వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీని కలెక్టరేట్ వద్ద సెట్విజ్ సిఇఓ రామ్ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడా పోటీల్లో భాగంగా ఐదు కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో ప్రధమ, ద్వితీయ, తృతీయబహుమతులతో పాటు పదిమందికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తామని, వీటిలో ఐదు ప్రోత్సాహక బహుమతులను బాలికలకు కేటాయించామని తెలిపారు. ఈ పోటీలో బాలబాలికలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.