బెంగళూర్ : గిప్టులు, లక్కీ డ్రా, ఓటీపీల పేరుతో మీకు మేసేజులు వస్తున్నాయా.. తక్కువ పెట్టుబడితో రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందవచ్చని చెబుతున్నారా..? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇదే తరహాలో ఏకంగా రూ.854 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూర్ కేంద్రంగా సైబర్ ఇన్వెస్ట్మెంట్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా బాధితులను నిందితుల ముఠా ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు. రూ. 1000 నుంచి రూ. 10,000 వరకు చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెడితే రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు లాభం పొందవచ్చని బాధితులను నమ్మించారని తెలిపారు. దీంతో వేలాది మంది బాధితులు రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు అంతకన్నా ఎక్కువ పెట్టుబడిని వివిధ బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా చెల్లించారని పోలీసులు వెల్లడించారు. బాధితులు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఎలాంటి డబ్బు వాపస్ రాలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. నిందితులు ఈ డబ్బును మనీలాండరింగ్ కి సంబంధించిన మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.