Oct 19,2023 07:12
  •  ఏడు జిల్లాల్లో కరువు సమస్య తీవ్రం
  •  ప్రభుత్వానికి నివేదికలు
  •  వేరుశనగ, మొక్కజొన్నకు భారీ లాస్‌
  • పత్తి, కంది, మిర్చి కూడా..
  • నీరందకుంటే వరి దిగుబడి తగ్గే అవకాశం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : ఖరీఫ్‌లో అనావృష్టి కారణంగా పలు జిల్లాల్లో వేసిన పైర్లకు అపార నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి జిల్లాల నుంచి ప్రాథమిక నివేదికలు అందాయి. రాయలసీమలో సాగైన వేరుశనగ చాలా ప్రాంతాల్లో నూటికి నూరు శాతం దెబ్బతింది. పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. రైతులు పంట పెట్టేందుకు పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోవాల్సిందే. సీమ జిల్లాల్లో వేరుశనగ తర్వాత మొక్కజొన్న బాగా దెబ్బతింది. పంట నష్టం 40 నుంచి 70 శాతం పైనే ఉంది. కొన్ని చోట్ల నష్టం వంద శాతం వరకు కనిపిస్తోంది. సీమ, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పత్తి, కంది, మిర్చి పంటలకు బాగానే నష్టం వాటిల్లింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ నీరందక వరి పైరు ఎండిపోతోంది. దిగుబడి నష్టం గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఖరీఫ్‌ ముగిసిన దరిమిలా ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనాలపై వ్యవసాయశాఖ ఎట్టకేలకు దృష్టి సారించింది. జిల్లాల నుంచి దిగుబడి నష్టంపై సమాచారం కోరింది. మీ ప్రాంతంలో ఫలాన పంట సాధారణ దిగుబడి ఎంత, ప్రస్తుతం ఎంత వచ్చే అవకాశం ఉంది అనే వివరాలను పంపాలని ఆదేశించింది. క్షేత్ర స్థాయి అధికారులు, డిఎఒలు రెండు రోజుల నుంచి వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయానికి నివేదికలు పంపుతున్నారు.

  • ఒకటి రెండు పంటలే

వర్షాభావం, డ్రైస్పెల్స్‌ మూలంగా పంటల సాగు తగ్గిన ఏడు జిల్లాల నుంచి తొలిదశలో సర్కారు నివేదికలు అడిగినట్లు సమాచారం. కరువు ప్రభావం తీవ్రంగా ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం నుంచి నష్టం అంచనాలు కోరారు. సమస్య ఉన్న మరికొన్ని జిల్లాల నుంచి కూడా రిపోర్టులు అడిగారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, నివేదికలు అడిగిన జిల్లాలను వారి వారి ప్రాంతాల్లో అధికంగా సాగు చేసే ఒకటి, రెండు ప్రధాన పంటల వివరాలే పంపమన్నారు. ఏ జిల్లా నుంచి ఏ పంటల సమాచారం పంపాలో ఏ ఫార్మెట్‌లో పంపాలో హెడ్‌ఆఫీస్‌ నుంచి దిశా నిర్దేశం చేశారు. కరువు మండలాల ప్రకటన కోసం అనే ప్రస్తావన చేయలేదు. కేవలం దిగుబడి నష్టాన్ని మాత్రమే తెలపమన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వేరుశనగకు ఊడలు కూడా రాలేదని, మొత్తానికే పంట మాడిపోయి నేలపాలైందని జిల్లాల అధికారులు నివేదికలు పంపారు. సాగైన పంట పశువుల మేతకు కూడా పనికిరాకుండా పోయిందని తెలిపారు. చిత్తూరు, వైఎస్‌ఆర్‌, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల నుంచి కూడా వేరుశనగపై ఇదే విధంగా నివేదించారు. సీమతో పాటు పలు చోట్ల మొక్కజొన్నకు అపార నష్టం వాటిల్లిందని, కంకులు రాని పరిస్థితి ఉందని తెలిపారు. మొక్కజొన్న నష్టం చాలా చోట్ల 40 నుంచి 70 శాతం వరకు ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో నష్టం వంద శాతం కూడా ఉందని తెలిపారు. ఈ ఖరీఫ్‌లో ఒక్క మొక్కజొన్నే సాధారణ విస్తీర్ణం కంటే కొచెం ఎక్కువ సాగైంది. వర్షాభావం వలన పంట సాగైందన్న ఆనందం రైతుల్లో ఆవిరైంది. అలాగే సీమ, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పత్తి, కంది, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. అక్కడక్కడ మిరప పంట 50 శాతానికిపైన చేతికొచ్చే పరిస్థితి లేదు. పలు జిల్లాల్లో నీరందక వరి పైరు ఎండిపోతోంది. ఈ పరిస్థితి ఇంకా కొన్నాళ్లు కొనసాగితే ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

  • దిగుబడి దిగదుడుపు

వేరుశనగ ఎకరాకు దిగుబడి కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఈ సంవత్సరం 16.10 లక్షల ఎకరాలకు 6.37 లక్షల ఎకరాల్లోనే వేశారు. సగటు దిగుబడి ఎకరాకు రెండున్నర క్వింటాళ్లొస్తాయన్నారు. ప్రస్తుతం అధికారుల అంచనాల్లో అసలేమీ రాదంటున్నారు. పత్తి దిగుబడి నాలుగున్నర క్వింటాళ్లు (కాయలు) వస్తాయని తొలుత చెప్పారు. చాలా చోట్ల అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. మొక్కజొన్న 15 క్వింటాళ్లన్నారు. చాలా చోట్ల అసలు వచ్చే స్థితి కనిపించట్లేదు. కందులదీ అదే పరిస్థితి. వరి ఎకరాకు సగటున 18 క్వింటాళ్లన్నారు. చివరికి ఎంత వస్తుందో తెలీకుండా ఉంది.