ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : కేంద్రం పెంచిన గ్యాస్ ధరలు తక్షణం తగ్గించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం కేశవరం గ్రామంలో కట్టెల పొయ్యి మీద గ్యాస్ సిలిండర్ పెట్టి వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బిగ్గరగా నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు మేలిన రమేష్, మనుగుల రాజబాబు, లోతా శ్రీను, లోతా వెంకటలక్మి, తదితరులు మాట్లాడుతూ, నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య కుటుంబాలపై కేంద్రం మళ్లీ వంట గ్యాస్ సిలిండర్ పై రూ 50, వాణిజ్య సిలిండర్ పై రూ 350 పైబడి భారం మోపడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలపై అమాంతంగా గ్యాస్ భారం మోపిందని విమర్శించారు. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమన్నారు,మోడీ ప్రభుత్వం రాకముందు వంట గ్యాస్ బండ ధర సుమారు రూ 417 ఉంటే, నేడు 1150 కు పెరిగిందని దీంతో కోట్లాది రూపాయలు సామాన్యులపై భారం పడుతుందని పేర్కొన్నారు. తొలిత సబ్సిడీపై వంటగ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తామని ప్రకటించిన కేంద్రం గత రెండేళ్ల నుండి సబ్సిడీ నిలిపివేసిందని విమర్శించారు. వాణిజ్య సిలిండర్ ధర కూడా రూ 350 పెంచడంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, ప్రజలపై ధరాభారాలు మోపి ప్రజల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం పెంచిన గ్యాస్ ధరలు తక్షణం ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, లోతా అర్జున్, మేలిన గంగా,ఎం శివ,పి వెంకటరెడ్డి,మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.










