Feb 05,2023 15:56

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : 2023-24 నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ దేశ ప్రజలపై  భారాలు మోపుతూ, కార్పొరేట్లకు వరాలు కురిపించే బడ్జెట్‌ అని సీపీఎం ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ఆదివారం రాజవొమ్మంగిలో నిరసన తెలియజేసి అనంతరం బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్బంగా సీపీఎం రంపచోడవరం జిల్లా కార్యవర్గసభ్యులు లోతా రామారావు మాట్లాడుతూ, గిరిజన ప్రాంత వాసులకు, 40 కోట్ల మంది కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ కనీస వేతనాల ప్రస్తావని గాని, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ గురించి గానీ, నూతన ఉపాధి కల్పన గురించి గాని, మూసివేసిన పరిశ్రమలను తెరిపించే ఆలోచన గాని, మహిళల రక్షణకు,ఏజన్సీ ప్రాంత అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా దేశం ఏ రకంగా అభివద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, మధ్య తరగతి ఉద్యోగులకు అంకెల గారడితో సరిపెట్టారని, పేదలకందించే ఆహార సబ్సిడీలను కోత విధిస్తూ ఐసిడిఎస్‌కి, మధ్యాహ్న భోజన పథకానికి,ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు తగ్గించారని, ఇది ప్రజల కొనుగోలు శక్తిని మరింత హరించి వేస్తుందని విమర్శించారు. కార్పొరేట్లకు వరాలు కురిపిస్తూ ప్రజల ఆస్థులైన ప్రభుత్వ రంగసంస్థలను కారు చౌకగా అమ్మేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. విభజన  హామీలు, ప్రత్యేక హౌదా, పోలవరం నిధులు కేటాయించకుండా నేను మండలాల ప్రజలకు  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరొకసారి అన్యాయం చేశారన్నారు,ఏజన్సీ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో  నిధులు కేటాయించకుండా  అన్యాయం చేశారన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే  25 మంది ఎంపీలు ఉన్న వైసిపి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, రాష్ట్ర  ప్రజల అవసరాలను జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరమన్నారు, తక్షణమే బడ్జెట్లో పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కొండ్ల సూరిబాబు, కె జగన్నాధం, మేలిన రమేష్, జర్తా రాజు, పి లోవరాజు, లోతా అర్జున్, జర్తా అబ్బాయి తదితరులు పాల్గొన్నారు.