
ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై విద్యుత్ ఛార్జీల పెంపుదాల పేరుతో ప్రజలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయని సిపిఐ, సిపిఎం నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు.విద్యుత్ చార్జీల పెంపుదాలకు వ్యతిరేకంగా గురువారం సీపీఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్) మచిలీపట్నం కమిటీల ఆధ్వర్యంలో ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మచిలీపట్నం నగర కార్యదర్శి బూర. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కరెంట్ చార్జీల పెంపుదల పేరుతో 1400 కోట్లు ప్రజలపై భారం వేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో 25 వేల కోట్ల రూపాయలు కరెంటు చార్జీలు పేరుతో ప్రజలపై భారం మోపిందని, సర్ చార్జి ల పేరుతో ప్రజలపై వేసే భారాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల కళ్ళు కప్పి గత పది సంవత్సరాల నుంచి వాడుకున్న కరెంటుకు బిల్లులు కట్టిన, మళ్లీ సర్దుబాటు చార్జీల పేరుతో జనం నెత్తిన తాజాగా 6వేల కోట్ల రూపాయలు భారం వేసిందన్నారు. ఈనెల బిల్లులో 2014 సంవత్సరంలో వాడుకున్న కరెంటుకి మరలా యూనిటీకి 20 పైసలు చొప్పున, 2021 లో వాడుకున్న విద్యుత్ కి 20 పైసలు చొప్పున, 2023 ఏప్రిల్ లో ఉపయోగించిన కరెంటుకి 40 పైసలు చొప్పున మొత్తం యూనిట్ కి 80 పైసలు చొప్పున జనంపై భారం వేస్తుందని ఈ భారాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజలందరూ వామపక్షాలు చేస్తున్న విద్యుత్ పోరాటానికి ప్రజలమద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కోనేరు సెంటర్లో సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్ )వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ మచిలీపట్నం నియోజకవర్గ కార్యదర్శి లింగం ఫిలిప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై మూడు రకాల బారాలు వేస్తుందని, ఇప్పటికే అనేక నిత్యవసర సరుకులు రేట్లు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో కరెంటు చార్జీలు పెంచడం సరైనది కాదని, సర్ చార్జీ రూపంతో వేస్తున్న అదనపు విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయిన జగన్ ప్రభుత్వం ఇక ప్రతినెలా వంటగ్యాస లాగానే కరెంటు చార్జీలు కూడా పెంచడానికి ఆదేశాలు ఇచ్చిందని, అంతేగాక ప్రతి వినియోగదారుడు కి స్మార్ట్ మీటర్ల పేరుతో 13 వేల నుండి 35 వేల వరకు భారం వేస్తుందని, ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విద్యుత్ బారాలకి వ్యతిరేకంగా కోనేరు సెంటర్లో జరిగే ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొనాలని పిలుపనిచ్చారు.