Aug 03,2021 22:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నదీజలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ కమిటీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నదీ జలాల వివాదాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్న సర్వోన్నత న్యాయ స్థానం సూచనను సిపిఎం రాష్ట్ర కమిటీ ఆహ్వానించింది. కృష్ణా నదీ జలాల వినియోగ విషయంపై ఇటీవల ఉభయ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొనడం విచారకరమని, అది మరింత పెరిగి పరిష్కారం కోసం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చిందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని, అనవసరంగా జోక్యానికి మూడో పక్షాన్ని ఆహ్వానించవద్దని సోమవారం నాటి విచారణలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించడం ముదావహమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికైనా చర్చల బాట పట్టి సామరస్యంగా జలవివాదాలను పరిష్కరించుకోవాలని సిపిఎం రాష్ట్రకమిటీ విజ్ఞప్తి చేసింది. అన్నదమ్ముల వలె మెలగవలసిన తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెరగకుండా సంయమనం పాటించాలని కోరింది.