Oct 09,2023 16:27

ప్రజాశక్తి-నందిగామ : జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న  గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో నందిగామ ఆర్డ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జగ్గయ్యపేట నుండి నందిగామ ఆర్డ్ఓ కార్యాలయం వద్ద కు సిపిఎం ఆధ్వర్యంలో యువకులు, బాధితులు బారీగా  బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ జగ్గయ్యపేట చుట్టు పక్కల కెమికల్ ఫ్యాక్టరీ లు ప్రభుత్వ అనుమతులు లేకుండా పెట్టి ప్రజారోగ్యం తో చెలగాట మాడుతున్నారని పేర్కొన్నారు. గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ నుండి వస్తున్న వ్యర్థాల వల్ల సుమారు మూడు గ్రామాల ప్రజలు అనారోగ్యం తో బాధపడున్నారన్నారు. ఈ  కంపెనీ నుండి వస్తున్న రసాయనాలు వల్ల స్కూల్ పిల్లలు సైతం అస్వస్థతకు గురైనారని తెలిపారు. పొలాలకు వచ్చే కూలీలు సైతం దుర్గంధం వాసన భరించలేక పనులకు రాకపోవటం తో  పంటలు సైతం సర్వ నాశనము అవుతున్నాయని తెలిపారు. పశువులు సైతం వాసన భరించలేక చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థ కాలుష్యం వల్ల అనేక మంది ప్రజానీకం కిడ్నీ వ్యాదులకు గురికావడం తో జగ్గయ్యపేటలో డయాలసిస్ సెంటర్  ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమంది ప్రజలు గ్రీన్ టెక్ కంపెనీ కాలుష్యం బారిన పడి క్యాన్సర్, కిడ్నీ వ్యాదులకు గురి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. అంతేకాకుండా విష జ్వరాలు, వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ప్రతి రోజు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు క్యూ కడుచున్నారని పేర్కొన్నారు. ప్రజల మాన ప్రాణాలతో చెలగాట మాడుతున్న అత్యంత ప్రమాదకరమైన గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ మూసివేసేంతవరకు సిపిఎం ఆధ్వర్యంలో నిరంతరము ఉద్యమాలు చేయటం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగ్గయ్యపేట మండల సిపిఎం కార్యదర్శి జి. నాగమణి మాట్లాడుతూ గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదకరమైన రసాయనాలు బయటకు వస్తుండటంతో ప్రజారోగ్యం కుంటు పడుతుందన్నారు. పశువులు సైతం వ్యర్థాలు పీల్చి చనిపోతున్నాయని, తక్షణమే గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ ప్రోడక్షన్ ఆపి వేయాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట మండల పరిధిలోని పుట్టగొడుగుల గా పుట్టుకొస్తున్న కాలుష్యం వెదజల్లే కెమికల్ ఫ్యాక్టరీ లను మూసివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నందిగామ ఆర్డ్ఓ రవీంద్ర రావుకు వినతిపత్రం అందజేశారు. ఆర్డ్ఓ రవీంద్ర రావు మాట్లాడుతూ జగ్గయ్యపేట మండలంలో ప్రజారోగ్యంతో చెలగాట మాడుతున్న గ్రీన్ టెక్ ఫ్యాక్టరీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫ్యాక్టరీ నడిపితే గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ మూసి వేయటానికి చర్య లు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, ఎన్ సి హెచ్ శ్రీనివాస్, చిరుమామిళ్ళ హనుమంతరావు, చనుమెాలు సైదులు, జగ్గయ్యపేట మండల సిపిఎం నాయకులు కోట కృష్ణ, రామనాథం, వెంకటేశ్వర్లు, శేషు, మహిళా సంఘం నాయకులు రాజేశ్వరి, సిపిఎం నందిగామ నాయకులు కర్రి వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు గోపి నాయిక్, నాయకులు ప్రణయ్ తేజ, హుస్సేన్, పలువురు నాయకులు పాల్గొన్నారు.