Aug 01,2021 21:49

* సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు
ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో :
రాష్ట్ర కమ్యూనిస్టు అగ్రనేతల్లో ఒకరు, సిపిఎం పోలిట్‌బ్యూరో మాజీ సభ్యులు లావు బాలగంగాధరరావు (ఎల్‌బిజి) శతజయంతి (2021 ఆగష్టు 3న)ని పురస్కరించుకొని ఆగస్టు 15 నుండి సెప్టెంబర్‌ 15 వరకు శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు అన్ని శాఖల మహాసభల సందర్భంగా కృషి చేయాలని, నెల రోజులపాటు సభలు, సమావేశాలు, మెడికల్‌ క్యాంపులు, శ్రమదానాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. శతజయంతి ఉత్సవాల ప్రారంభ సూచికంగా ఆగష్టు 3న సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్‌ సభ జరుగుతుందని, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యవక్తగా ప్రసంగిస్తారని మధు తెలిపారు

ఎల్‌బిజి 1921 ఆగష్టు 3న గుంటూరు జిల్లాలో జన్మించారు. జాతీయోద్యమ కాలంలోనే ఆయన కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులై, గుంటూరు జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గన్న కమ్యూనిస్టు అగ్రనేతల్లో ఎల్‌బిజి ఒకరు. వ్యవసాయకార్మిక సంఘం అఖిలభారత అధ్యక్షులుగా పని చేశారు. పార్టీ పిలుపు మేరకు తన వాటాగా వచ్చిన 4 ఎకరాల పొలం అమ్మి ఆ డబ్బుని పార్టీకి ఇచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎల్‌బిజి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 1985 నుండి 1991 వరకు రాష్ట్ర కార్యదర్శిగానూ, 1989 నుండి 1995 వరకు పొలిట్‌బ్యూరో సభ్యునిగానూ పని చేశారు.