Jul 25,2021 16:18

న్యూఢిల్లీ : కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను వణికించింది. మొదటి వేవ్‌లో కన్నా సెకండ్‌ వేవ్‌లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నుండి మరణాలు ప్రారంభమైనా.. దేశంలోని మొత్తం కరోనా మరణాల్లో సగం మరణాలు ఏప్రిల్‌, మే నెలల్లోనే నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సిడిసి) ఈ డేటాను అందించింది. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం (ఐడిఎస్‌పి) కింద కరోనా వ్యాధి రికార్డులను నిర్వహించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్‌సిడిసి అనే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది. అయితే అన్ని కరోనా మరణాలు ఎన్‌సిడిసికి నివేదించబడలేదని ఎన్‌సిడిసి జాయింట్‌ డైరెక్టర్‌ డా.వినరుకుమార్‌ గార్గ్‌ తెలిపారు.

ఏప్రిల్‌, మే నెలల్లో కరోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందిందీ ఈ గణాంకాలు చూస్తే అర్థమౌతుంది. 2020 ఏప్రిల్‌ నుండి పరిశీలించగా.. ఈ రెండు నెలల్లోనే అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యాయని తెలిపింది. దేశంలో రెండు నెలల్లో నమోదైన మొత్తం మరణాల్లో 41 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ నుండి వచ్చాయని.. ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక మరణాల రేటు నమోదైందని తెలిపింది. 14 నెలల్లో నమోదైన మొత్తం మరణాల్లో 60 శాతం ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌ల్లో ఈ రెండు నెలల్లో రికార్డు కావడం గమనార్హం. 2020 ఏప్రిల్‌ నుండి 2021 మే నెల మధ్య 3,29,065 మంది కరోనాతో మరణించగా.. 2021 ఏప్రిల్‌, మే నెలల్లో ఈ సంఖ్య 1,66,632గా ఉన్నట్లు ఎన్‌సిడిసి తెలిపింది. ఏప్రిల్‌ నెలలో 45,882 మంది మరణించగా, మే నెలలో 1,20,770 మంది మరణించారు.

జూన్‌లో 69,354 మంది కరోనాతో మరణించగా, కొన్ని మరణాలను అధికారులు ఏప్రిల్‌, మే నెలలో నమోదు చేయలేనివి కూడా ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్‌, మేకి ముందు 2020 సెప్టెంబర్‌లో 33,035 మంది మరణించారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ల మధ్య మొదటి వేవ్‌లో కరోనా విజృంభించింది. అనంతరం 2021 ఫిబ్రవరిలో కరోనా మరణాలు 2,777కు తగ్గాయని తెలిపింది. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌లలో మరణాల సంఖ్య పెరగడంతో.. దేశీయంగా కరోనా మరణాలు రెట్టింపు సంఖ్యలో నమోదు కావడంతో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనట్లు నిపుణులు హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరిగాయి. ఇదే సమయంలో అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడులలో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారాలు చేపట్టగా, మరోవైపు హరిద్వార్‌లో మహా కుంభమేళా జరిగింది. దీంతో మే2న ఎన్నికల ఫలితాల అనంతరం.. ఎన్నికలు జరిగిన ఈ ఐదు రాష్ట్రాల్లో కరోనా మరణాలు ఐదు రెట్లు పెరిగాయని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. మహమ్మారి సమయంలో నివేదించబడిన మరణాలకు గల కారణాలపై సమాచారం లేదని ఆయన తెలిపారు. మరోవైపు అత్యధిక జనాభా కలిగిన యుపి, బీహార్‌ రాష్రాలు మరణాల సంఖ్యను సరిగా నమోదు చేయలేదని   ప్రభుత్వం పేర్కొంది.