Aug 01,2021 19:10

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సృష్టించిన విలయానికి చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. అయినప్పటికీ కరోనా కాలంలో కొన్ని వ్యాపారాలు మాత్రం ఎన్నడూ లేనంతగా జరిగాయి. ఈ మహమ్మారి కాలంలో వినియోగదారులు రకరకాల తినుబండరాలపై ఆసక్తి కనబరడంతో ప్యాకేజ్డ్‌ కుకీలు, చిప్స్‌, నూడుల్స్‌, మాకరోని వంటి స్నాక్స్‌కు కరోనా కాలంలో డిమాండ్‌ బాగా పెరిగింది. గురువారం కాంటార్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్‌-మే 2019 నుంచి ఏప్రిల్‌-మే 2020 మధ్య ఈ స్నాక్స్‌కు డిమాండ్‌ 8 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఆ తర్వాత సంవత్సరం ఏప్రిల్‌-మే 2020 నుంచి ఏప్రిల్‌-మే 2021 మధ్య 12 శాతం పెరిగినట్లు పేర్కొంది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో ప్యాకేజ్డ్‌ కుకీలు, చిప్స్‌, నూడుల్స్‌, మాకరోని వంటి స్నాక్స్‌ తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడటంతో వాటికి డిమాండ్‌ అమాంతం పెరిగింది.