Jul 25,2021 17:35

లండన్‌ : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలు దేశాల్లో కరోనా కొత్త కొత్త వేరియంట్లు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో మరో కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. ఇప్పటికే 16 కేసులను గుర్తించినట్లు పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ తెలిపింది. దర్యాప్తులో ఉన్న వేరియంట్‌ గా బుధవారం ది ఇండిపెండెంట్‌ నివేదించింది. ఏదైనా వేరియంట్‌ను ఆసక్తి, ఆందోళన వర్గాలుగా విభజించడానికి ముందు ఆ వేరియంట్‌ను పరిశోధిస్తారని.. పేర్కొంది. విదేశీ ప్రయాణాలతో ఈ కేసులు ముడిపడి ఉన్నాయని.. దీంతో ఈ వేరియంట్‌ వ్యాప్తి తీవ్రతపై ఆధారాలు లేవని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న వేరియంట్‌ దీ .1.621 ప్రపంచంలో కొత్తదేమీ కాదని.. జనవరిలో కొలంబియాలో గుర్తించారని వెల్లడించింది. బ్రిటన్‌లో గత కొద్ది వారాలుగా కరోనా కేసులు అత్యధికంగా రికార్డవుతున్నప్పటికీ.. ఈ వారంలో కరోనా ఆంక్షలను ఎత్తివేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. శనివారం బ్రిటన్‌లో 31,794 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో కరోనా ఆర్‌ రేట్‌ 1.2-1.4 మధ్యలో ఉందని.. అంటే వ్యాధి వ్యాప్తి ఒకరి నుండి ఎక్కువమందికి సోకే ప్రమాదం ఉందని అన్నారు.