Jul 31,2021 15:05

హైదరాబాద్‌ : తెలంగాణలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియను సహకార సంఘాల రిజిస్ట్రార్‌ వీరబ్రహ్మయ్య శనివారం ప్రారంభించారు. సులభతర విధానంలో భాగంగా సహకార సంఘాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సహకార శాఖ ఆధ్వర్యంలో ఈ-సహకార సేవ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకుని తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964, పరస్పర సహకార సంఘాల చట్టం 1995 ద్వారా సహకార సంఘాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ప్రజలు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేయగానే.. నిబంధనల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించి ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, సంబంధిత రిజస్టర్డ్‌ బైలాలను రిజిస్ట్రార్‌, జిల్లా సహకార అధికారి దరఖాస్తుదారునికి ఆన్‌లైన్‌లోనే పంపించనున్నట్టు వీరబ్రహ్మయ్య తెలిపారు.