Nov 03,2022 06:32

ఒడిషాలో 57 వేల మంది, రాజస్థాన్‌లో 1,10,279 మంది, పంజాబ్‌లో 28 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులరైజ్‌ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాని ఏపి లో ఎన్నికల ముందు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, సమాన పనికి సమాన వేతనాలంటూ ఊరించిన వైసిపి...తీరా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలను అటకెక్కించింది.

  • అమలు కాని హామీలు

'మాట తప్పను, మడమ తిప్పను' అన్నారు వైసిపి నేత జగన్‌ మోహన్‌ రెడ్డి. అయితే ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేతనాల విషయంలో, రెగ్యులరైజేషన్‌ విషయంలో మాట తప్పింది. మడమ తిప్పుతోంది. రాష్ట్రంలో 2,45,000 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, 60 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. అందరికీ సమాన పనికి - సమాన వేతనం అన్న జగన్‌ మోహన్‌ రెడ్డి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 2005 నుండీ అమలయిన పద్ధతులకు పాతరేసి అతి తక్కువ వేతన పెంపుతో చేతులు దులుపుకొన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగుల బేసిక్‌కు సమానంగా వేతనాల అమలుతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాలంలో ఇచ్చిన జీవో3 కు తిలోదకాలిచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కనీస బేసిక్‌కు సమానంగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు అమలు చేయాలని సివిల్‌ అప్పీల్‌ 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రెగ్యులరైజేషన్‌ విషయంలోనూ పొంతన లేని కబుర్లు చెబుతున్నది.

  • హామీల అమలెప్పుడు?

సాధ్యమైనంత ఎక్కువ మందిని త్వరలోనే రెగ్యులరైజ్‌ చేస్తామని సెక్రటేరియట్‌ సాక్షిగా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించి 3 సంవత్సరాలైంది. నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. రెగ్యులరైజేషన్‌కు 11 వేల మందికే అర్హత ఉందంటూ కొంత మంది అమాత్యులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఖ్యకు, వీరి లెక్కలకు ఎక్కడా పొంతనే లేదు.

  • మారని ప్రభుత్వాల విధానాలు

ఏళ్ళ తరబడి పని చేయించుకోవడమే కాని కనీసం పనిచేస్తున్న వారి లెక్కనూ సరిగ్గా చెప్పలేకపోవడం మన రాష్ట్రానికే చెల్లింది. 2002 నుండీ నేటి వరకూ పరిపాలన వెలగబెట్టిన పార్టీలన్నీ చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల చేత ఊడిగం చేయించుకుంటున్నాయి. పని చేయడానికి పనికి వచ్చే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కు ఎందుకు అర్హులు కారు? పాలన సాగిస్తున్న పార్టీలు మారుతున్నాయే కాని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పట్ల వీటి విధానాలు మాత్రం ఒక్కటే. ఈ విషయం ఉద్యోగులు గ్రహించాలి. ఒడిషా తరహాలో సుదీర్ఘ పోరాటానికి సన్నద్ధం కావాలి. ఈ పార్టీల విధానా లపై సమర శీలంగా ఐక్యంగా పోరు సల్పాలి.

  • మూడు రాష్ట్రాల్లో రెగ్యులరైజేషన్‌

ఒడిషాలో ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు దశల వారీగా పోరాటాలు నిర్వహించారు. రెండు నెలల పాటు పోరాటాలను ఉధృతం చేశారు. వేలాది మంది ఐక్యంగా ఆందోళనలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా పోరాటాల్లో భాగస్వాములను చేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి సహకారం అందించాయి. దాంతో దాదాపు 57 వేల మందిని రెగ్యులరైజ్‌ చేస్తూ ఒడిషా లోని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీరందర్నీ రెగ్యులరైజ్‌ చెయ్యడానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం 2022 అక్టోబర్‌ 16న నోటిఫికేషన్‌ ఇచ్చింది. రూల్స్‌ను ఆ నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. నియమితులైన వారందరూ రెగ్యులర్‌ పోస్టులో నియమించిన వారిగా పరిగణించబడతారని పేర్కొంది. గ్రూప్‌-బి, గ్రూప్‌-సి, గ్రూప్‌-డి పోస్టుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై నియమించబడిన వారందరికీ రూల్స్‌ను రూపొందించింది. ఆ రూల్స్‌లో పాయింట్‌ 4(2) ప్రకారం వేతనాలు, నోషనల్‌ ఇంక్రిమెంట్లను...వారు కాంట్రాక్టు సర్వీసులో జాయిన్‌ అయిన తేదీని బట్టి నిర్ణయిస్తారు. పాయింట్‌ 4(3) ప్రకారం 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ వారు జాయిన్‌ అయిన తేదీ నుండి పే ఫిక్స్‌ చెయ్యబడుతుంది. పాయింట్‌ 4(4) ప్రకారం వారికి సర్వీసు బెనిఫిట్లు, ప్రమోషన్లు, పాయింట్‌ 4(5) ప్రకారం వారి కేడర్‌లో సీనియార్టీ వంటివన్నీ పరిగణించబడతాయి.
రాజస్థాన్‌లో విద్య, పంచాయితీరాజ్‌ తదితర శాఖల్లో 1,10,279 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేసే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా ప్రకటించారు. రాజస్థాన్‌ లోనూ వివిధ శాఖల్లోని ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌కై ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం ''రాజస్థాన్‌ కాంట్రాక్ట్‌ హైరింగ్‌ టు సివిల్‌ పోస్టు రూల్స్‌-2022''ను అమలు చేసే ప్రతిపాదనను ఆమోదించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల కాంట్రాక్ట్‌ కార్మికులందరికి ఈ నిబంధనలను వర్తింపచేస్తామని, వారి సామాజిక భద్రతపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటుందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు.
పంజాబ్‌లో నూతనంగా ఏర్పడిన ఆప్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే సిపిఎస్‌ రద్దు చేసింది.

  • ఐక్యంగా పోరాడదాం

కాని మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనుచూపు మేరలో కనబడటం లేదు. ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నేటికీ అమలు చెయ్యలేదు. ఈ విషయంలో వైసిపి ప్రభుత్వానికి జీరో మార్కులే వచ్చాయి. ఆప్కాస్‌ వల్ల ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ బదులుగా ప్రభుత్వ కాంట్రాక్టర్‌ మాత్రమే వచ్చారు. ఒడిషా ఉద్యోగుల పోరాట స్ఫూర్తితో ఏ.పి లోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులంతా శాఖలు, కేడర్లు పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలి. ఐక్య పోరాటాలు సుదీర్ఘ కాలం సాగించడానికి సన్నద్ధం కావాలి. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమరశీలంగా ఐక్యంగా పోరాడాలి.

contract employees article

 

 

/ వ్యాసకర్త : ఏ.వి. నాగేశ్వరరావు, సి.ఐ.టి.యు రాష్ట్ర కోశాధికారి,
సెల్‌ : 9490098031 /