
చాన్నాళ్లకి ఆమెను మళ్లీ చూడబోతున్నానన్న ఊహే కాలు నిలవనివ్వడం లేదు. మనసునీ నిలవనివ్వడం లేదు. అంతా గమనిస్తున్న శ్రీమతి కూడా 'ఓ యబ్బో...విడ్డూరం' అని ఆటపట్టిస్తుంది. శ్రీమతికి తెలుసు కదా ఆమెతో నా అనుబంధం. అంతా చెప్పేశాను కదా. అయితే అందుకు కాదు ఆ ఆటపట్టింపు. అంత వీడలేని బంధమైతే, ఇన్నాళ్లూ మాటవరసకైనా తనని తలుచుకో లేదేమని.
నిజమే. శ్రీమతి అలా అనిందని కాదు గానీ అందులో నిజం నూటికి నూరు పాళ్ళు. నేనేనా ఇలా మారిపోయానన్న ఆశ్చర్యం. ఒకప్పుడు ఆ నులివెచ్చని ఒడిలో కుక్కపిల్లలా ఒదిగిపోయే వాడిని. జన్మంతా ఆ వెచ్చదనంలో గడిపేయాలని, అసలు ఎలాంటి పరిస్థితి లోనూ వదిలి వెళ్లకూడదని అనుకొనే వాణ్ణి. ఆమె లేకుండా బతుకుని ఊహించేవాడినే కాదు. అలాంటిది ఇలా పెళ్లయ్యాకనో లేదా ఇంకొంచెం ముందుగానేనో ఆ చిటికెన వేలు వదిలేశాను. ఇన్ని దశాబ్దాల్లో తనను తలచింది లేదు.
మొదట్లో ఎంత పలవరించే వాడిని. ఆమె సహచర్యంలో గడిపిన ప్రతీ క్షణాన్నీ నెమరు వేసుకునే వాణ్ణి. నన్ను మనసారా ప్రేమించడమే కాదు నన్ను నన్నుగా తీర్చిదిద్దింది. ఆమెతో నాకు ఎలాంటి దాపరికాలు లేవు. ఆ అవసరం కూడా పడలేదు. నేను చేసిన ప్రతీ పని ఆమెకు ఎరుకే. ఎన్ని వేషాలేసినా ఆమె ముందు బుద్ధిమంతుడు అయిపోయేవాణ్ణి. ఆకలిదప్పులు గుర్తుకు వచ్చేవి కావు. ఆమెని ఇంప్రెస్ చేద్దామని కాదు గానీ ఒక్కోసారి రాత్రీ పగలూ తెలియకుండా పని చేసేవాడిని. అయినా కష్టమనిపించేది కాదు. తను గర్వంగా చూసినట్టు అనిపించి ఇష్టమనిపించేది. ఎంతో సున్నిత హృదయం. ఎదుటి మనిషి కష్టానికి మౌనంగా కన్నీరు పెట్టుకునేది. ఆ కన్నీరు తుడవడం కన్నా నాకేదీ గొప్ప అనిపించేది కాదు. అందుకనే తెలియకుండానే కర్తవ్యంగా భావించి లీనమై పోయేవాడిని. అలసి పడుకున్నప్పుడు నిశ్శబ్దంగా చేరినా తల నిమురుతున్నట్టు తెలిసి మరింత ముడుచుకొని నిద్దరోయే వాణ్ణి.
నేనేనా తనని మరచిపోయి, విడిచి వెళ్లి ఇన్నాళ్లూ తలవనైనా తలవంది! ఇంత ప్రేమ రాహిత్యమా?
ఆమెను చూశాను. దశాబ్దాల తర్వాత...ఉద్విగంగా. అలానే ఉంది. నిండు నూరేళ్ల పండుగ నాడు. ఆమె ఎవరో కాదు.
ఆ అంటే ఆంధ్ర. మె అంటే మెడికల్ కాలేజీ.
నన్ను తొమ్మిదేళ్లు మోసి పెంచిన మరో అమ్మ. గంపెడు మంది పిల్లల్ని ఏటేటా తీర్చిదిద్దుతూ కొంచెం కూడా విశ్రమించని అమ్మ.
(ఈ నెల 27,28,29 తేదీల్లో వందేళ్ల పుట్టినరోజు పండగ జరుపుకుంటున్న ఆంధ్రా మెడికల్ కాలేజీ విద్యార్థిగా...)
- డా.డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ.