Oct 27,2023 15:51
  • జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు 

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్ : స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారం అందించేలా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు జేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.సుధీర్ రెడ్డి హాజరై.. ప్రజల తరపున సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి రాలేని వారికి ఇది మంచి అవకాశం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. గ్రామ స్థాయి సమస్యలు, మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారం అయ్యేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల సమస్యలకు మెరుగైన, వేగవంతమైన పరిష్కారం అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. "జగనన్నకు చెబుదాం" కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజల అర్జీలకు అధికారులు అందించే పరిష్కార నివేదికలు కూడా స్పష్టంగా ఉండాలని  ఇందులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం జమ్మలమడుగు ఎమ్మెల్యే డా.సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన క్షేత్ర స్థాయిలో ఎలా ఉంటుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అభినందనీయం అని ప్రశంసించారు. స్థానిక ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జమ్మలమడుగు ప్రెస్ క్లబ్ తరుపున ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను ప్రెస్ క్లబ్ కోసం స్థలం అలాగే, జమ్మలమడుగు విలేకరులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రతి విలేకరికి మూడు సెంట్లు స్థలం రోడ్డుకు అనువైన ప్రదేశంలో ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు న్యాయం చేయాలని పెద్దమొత్తంలో అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలోజేసీ గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ శ్రీనివాసులు, పట్టణ, మండల ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.