ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేసి గురువారం నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ. పి.వెంకటరమణ, ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ, బాలికలు గర్భిణీ స్త్రీలలో రక్తహీనత తగ్గుదల, విద్య, వైద్యం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను బుధవారం భౌతిక పరిశీలన పూర్తి చేసి పోలింగ్ నిర్వహణకు అనువుగా ఉన్నాయా లేదా గురువారం వాటి స్థితిగతుల నివేదిక అందజేయాలన్నారు. ఎక్కడైనా మరమ్మతులు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న వ్యత్యాసం తొలగించుటలో భాగంగా ఒకే ఇంటి నంబర్ పై పదికి మించి ఉన్న ఓటర్లకు సంబంధించి 4,455 ఇళ్లను ఏ ఈ ఆర్ ఓ లు వ్యక్తిగత శ్రద్ధ వహించి క్షుణ్ణంగా సమాచారం రెండు రోజుల్లో సేకరించాలన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంపై పూర్తిగా శ్రద్ధ వహించాలన్నారు. మచిలీపట్నం, పామర్రు శాసనసభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలన్నారు. రక్తహీనత ఉన్న బాలికలు గర్భిణీ స్త్రీల వివరాలను, సరైన ఎదుగుదల లేని బరువు తక్కువ ఉన్న పిల్లల వివరాలను త్వరగా సిద్ధం చేసి రక్తహీనత, ఎదుగుదల, బరువులో పురోగతి సాధించేందుకు విద్యా వైద్య స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవల పెంపుదలకు చొరవ తీసుకోవాలన్నారు.అదేవిధంగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి మంచి విద్యాబోధన, కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే దిశగా వారిని సిద్ధం చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి అక్కడ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
మనబడి నాడు నేడు పనులను వేగవంతం చేయాలన్నారు. ఇందుకోసం మండల విద్యాధికారులను పర్యవేక్షించేలా చూడాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో ఈ ఆర్ ఓ లు, తహసీల్దారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.










