Aug 05,2021 22:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో చెట్లపెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కలిసికట్టుగా అడుగులు వేస్తే రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జగనన్న పచ్చతోరణాంవనమహోత్సవ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గన్నారు. ముందుగా వేప, రావి మొక్కలను సిఎం నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సుమారు 5కోట్ల మొక్కలను నాటడానికి అటవీ శాఖను పురమాయించిన్నట్లు తెలిపారు. 23శాతమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33శాతం పెంచే దిశగా అందరూ ప్రయత్నం చేయాలని కోరారు. కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కురుస్తాయన్నారు. చెట్ల వల్ల జరిగే మంచిని జ్ఞాపకం పెట్టుకుంటే వాటిని పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుందన్నారు. అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దాలని సిఎం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అటవీ విస్తరణలో దేశంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జగనన్న పచ్చతోరణం ద్వారా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కరోనా నేపధ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతీ కార్యక్రమం కూడా చెప్పిన తేదీకే అమలు చేస్తూ సిఎం పాలన సాగిస్తున్నారని తెలిపారు. అటవీ దళాధిపతి ఎన్‌ ప్రతీప్‌ కుమార్‌ వందన సమర్పణ చేసిన ఈ కార్యక్రమంలో అటవీశాఖ కార్యదర్శి జిఎస్‌ఆర్‌కె విజయకుమార్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గని ప్రసంగించారు. మంత్రులు చెరుకువాడ రంగనాధ రాజు, మేకతోటి సుచరిత పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Cm Jagan : యజ్ఞంలా చెట్లపెంపకం : వనమహోత్సవంలో సిఎం జగన్‌