Jul 30,2021 18:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖపై శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి రెండువేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్‌ ఆఫీసు వస్తుందని అన్నారు. గ్రామ, వార్డు స్థాయి ల్లోనే రిజిస్ట్రేషన్లు జరగడం వల్ల భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు అస్కారం ఉండదని చెప్పారు.అర్హులైన పేదలందరికీ 90 రోజుల్లో ఇంటిస్థలాలను మంజూరు చేయాలన్నారు.. నిర్దేశించుకున్న సమయం ప్రకారం టిక్కో ఇళ్లను పూర్తి కావాలన్నారు. మొదటివిడతలో 38 ప్రాంతాల్లో చేపట్టిన 85,888 ఇళ్లలో సుమారు 45 వేలకుపైగా ఇళ్లు మూడు నెలల్లోగా, మిగిలిన ఇళ్లు డిసెంబర్లోగా లబ్దిదారులకు అప్పగిస్తామన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టలను సిఎం ప్రస్తావించారు. విజయవాడ అర్బన్‌ క్లినిక్స్‌పైనా మాట్లాడారు. విజయవాడ, గుంటూరు, నెల్లురూలో యుజిడి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళగిరిాతాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పులివెందులలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన మహిళా మార్టు నిర్వహణ బాగుందని చెప్పారు. 72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆగస్టు 15 కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.