Jun 07,2021 10:35

అసలు పేరు : కొణిదెల శివశంకర వరప్రసాద్‌
పుట్టిన తేదీ : 22 ఆగస్టు, 1955
పుట్టిన ప్రదేశం : మొగల్తూరు, పశ్చిమగోదావరి జిల్లా
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
భార్య : సురేఖ
పిల్లలు : సుస్మిత, శ్రీజ, రాంచరణ్‌ తేజ
తల్లిదండ్రులు : కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి

సోదరులు : నాగేంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

   ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. ఆక్సిజన్‌.. దేశ వ్యాప్తంగా కరోనా వేళ ఇప్పుడు ఇదే చర్చ కొనసాగుతోంది. అనేక మార్గాల ద్వారా ఆక్సిజన్‌ తరలింపు నిరంతరం జరుగుతున్నా.. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు ప్రాణ వాయువు సరైన సమయంలో అందటం లేదు. ఫలితంగా పదుల సంఖ్యలో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోకూడదు అనే ఉద్దేశంతో టాలీవుడ్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ జిల్లాలోనూ 'చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌'లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకుని, అమలు చేస్తున్నారు. వారం రోజులుగా ఒక్కో జిల్లాలో ఈ ఆక్సిజన్‌ బ్యాంకులను నెలకొల్పుతున్నారు. తొలుత గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. ఆ తర్వాత ఖమ్మం, విశాఖ, కర్నూలు, విజయవాడ, అమలాపురం, అనంతపురంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్‌చరణ్‌ చూసుకుంటున్నారు.
రక్తం దొరక్కుండా ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో మెగాస్టార్‌ చిరంజీవి గొప్ప మనసుతో 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌'ను ప్రారంభించిన సంగతి విదితమే. చూపులేని వారికి చూపు ఇవ్వాలనే లక్ష్యంతో ఐ బ్యాంకునూ స్థాపించారు.
   ఆయా ప్రాంతాలలో చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్‌ అధ్యక్షులే ఎక్కడికక్కడ ఈ ఆక్సిజన్‌ బ్యాంక్స్‌ ఏర్పాటు బాధ్యతలను చూసుకుంటున్నారు. చిరంజీవి అండగా మెగా అభిమానులు సైతం మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం, తమ వంతు విరాళాలు అందించడం గొప్ప విషయం అనే చెప్పవచ్చు. కాకపోతే మరికొంత ముందే ఈ కార్యక్రమం చేపట్టి ఉంటే ఎందరో ఊపిరి పోసుకునేవారు.

                                                                  మెగాస్టార్‌ను మెస్మరైజ్‌ చేసిన చిన్నారి

మెగాస్టార్‌ను మెస్మరైజ్‌ చేసిన చిన్నారి

   అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్‌పైర్‌ చేసిందని మెగాస్టార్‌ చిరంజీవే స్వయంగా తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ బ్యాంకుల ద్వారా ఎంతో మంది పేదలకు ఆక్సిజన్‌ అందుతోంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న మెగాస్టార్‌ చిరంజీవికి ఓ చిన్నారి ఆలోచన మరింత స్ఫూర్తిదాయకంగా నిలిచిందని మెగాస్టార్‌ స్పష్టం చేశారు. అన్షి తన పుట్టినరోజు సందర్భంగా తాను దాచుకున్న డబ్బును చిరంజీవి చారిటబుల్‌ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా ఓ వీడియో ద్వారా తెలియజేశారు.
   ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. 'పి.శ్రీనివాస్‌, శ్రీమతి హరిణి గార్ల చిన్నారి పేరు అన్షి ప్రభాల. జూన్‌ 1న తన బర్త్‌ డే. తను దాచుకున్న డబ్బుతో పాటు.. తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకుల కోసం ఇచ్చింది. ఈ సందర్భంగా తను.. ''తన చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది'' అని తెలిపింది. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్తపరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినయ్యాను. అన్షి స్పందన నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్‌పైర్‌ చేసింది. అన్షి డ్రీమ్స్‌ అన్నీ నిజమవ్వాలని నేను విష్‌ చేస్తున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్‌ బ్లెస్‌ యు అన్షి. హ్యాపీ బర్త్‌ డే. లవ్‌ యూ డార్లింగ్‌' అని అన్నారు.
 

                                                                       సేవా రంగంలో..

    చిరంజీవి అక్టోబర్‌ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌' స్థాపించారు. 'చిరంజీవి బ్లడ్‌ బాంక్‌', 'చిరంజీవి ఐ బాంక్‌' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్దఎత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో సుమారు లక్ష మంది, నేత్రదానం వలన వేలాది మంది సేవలనందుకొన్నారని అంచనా. ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.
    ఇప్పటికే సినీ రంగంలో కార్మికులకు ఆర్థిక, హార్థిక సహాయం చేశారు. కరోనా సమయంలో అనేకమంది నటీనటులను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆలస్యమైనా ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేసినందుకు మెగాస్టార్‌కు జేజేలు చెబుదాం. మున్ముందూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుందాం.