Oct 05,2023 08:54

బీజింగ్‌ : 2028లో చంద్రుడి అన్వేషణా మిషన్‌ 'చాంగ్‌ ఇ-8'ను ప్రయోగించాలని చైనా భావిస్తోంది. చాంగ్‌ ఇ-7తో కలిసి చాంగ్‌ ఇ-8 చంద్రుడిపై పరిశోధనలకు నిర్మించే స్టేషన్‌ మౌలిక స్వరూపాన్ని రూపొందిస్తుందని చైనా జాతీయ రోదసీ సంస్థ (సిఎన్‌ఎస్‌ఎ) ప్రకటించింది. ఇక్కడ జరుగుతున్న 74వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల మహాసభలో సోమవారం ఈ మేరకు ప్రకటన వెలువడింది. చాంగ్‌ ఇ-8తో ముడిపడిన అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన అవకాశాలను కూడా ఆ ప్రకటన వెల్లడించింది. ''సమానత్వం, పరస్పర ప్రయోజనాలు, శాంతి కోసం వినియోగం, సమాన అవకాశాలు, సహకారం'' అన్న సిద్ధాంతాలకు చైనా లూనార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రాజెక్టు కట్టుబడి వుందని ఆ మహాసభకు సమర్పించిన పత్రం పేర్కొంది. అంతర్జాతీయ సమాజంతో పరస్పర సహకారానికి కూడా సిద్ధంగా వున్నామని పేర్కొంది. మిషన్‌, సిస్టమ్‌, యూనిట్‌ స్థాయిలో సహకరించాల్సిందిగా, పాల్గొనాల్సిందిగా దేశాలను, అంతర్జాతీయ సంస్థలను సిఎన్‌ఎస్‌ఎ ఆహ్వానించింది. గణనీయమైన కొత్త శాస్త్రీయ అన్వేషణలను సంయుక్తంగా సాధించడానికి, మానవాళి భవిష్యత్‌ ప్రయోజనాలకు దోహదపడేందుకు ముందుకు రావాల్సిందిగా కోరింది. రోదసీ నౌక నుండి రోదసీ నౌకకు సంబంధాలు, సంయుక్త అన్వేషణ, మౌలిక నిర్వహణా సామర్ధ్యాలతో చంద్రుని ఉపరితలంపై రోబోలు, అనుబంధ సైంటిఫిక్‌ పేలోడ్‌లు వంటి ప్రాధాన్యతాపరమైన కర్తవ్యాల్లో అంతర్జాతీయ సహకారాన్ని చైనా కోరుతోంది.